ఏదో జన్మలో మీకు నాకు అనుబంధం. లేకపోతే పులి నోటికి చిక్కాల్సిన దాన్ని మీ ఇంట్లోకి వచ్చిపడ్డాను అని అన్నట్లే ఉంది జింక వాలకం చూస్తుంటే. అర్థరాత్రి అమాంతం ఇంటి పై కప్పు నుంచి ఇంట్లోకి చొరబడ్డ జింకను చూసి ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు ఇంట్లో వాళ్లు. మహారాష్ట్ర ముంబైలోని పోవాలి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ మచ్చల జింక తనను వేటాడుతున్న చిరుత నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఇంటి పై కప్పు నుంచి ఇంట్లో పడింది. అయినా సై కప్పుకి చేరుకున్న చిరుత ఏమనుకుందో ఏమో మనసు మార్చుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది.
భగవంతుడా.. బతికి పోయాను అనుకుని ఊపిరి పీల్చుకుంది జింక. అర్థరాత్రి ఈ శబ్దాలేంటి అని నిద్ర నుంచి లేచి చూస్తే ఎదురుగా జింక కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది జింకను జాగ్రత్తగా బంధించి సంజయ్ గాంధీ జాతీయ పార్కుకు తరలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.