UP : యూపీలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పాక్ మహిళ
30 ఏళ్లుగా ఫేక్ డాక్యుమెంట్లతో మోసం..
పాకిస్థాన్ జాతీయురాలై ఉండి, ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రాథమిక విద్యా విభాగంలో ఉద్యోగం పొందిన మహిళా ఉపాధ్యాయురాలిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాంపూర్ ప్రాంతానికి చెందిన మహిరా అక్తర్ అలియాస్ ఫర్జానా అనే మహిళ 1979లో పాకిస్థాన్ వ్యక్తిని వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆమె పాకిస్థాన్ పౌరసత్వం పొందినట్లు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల అనంతరం భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలతో పాకిస్థాన్ వీసాపై ఆమె భారతదేశానికి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని, తాను భారతీయురాలినని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఫర్జానాపై విద్యా శాఖ అధికారులు అంతర్గత విచారణ చేపట్టగా ఆమె పాకిస్థాన్ జాతీయురాలని తేలింది.
నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు గుర్తించిన అధికారులు ఆమెను తొలుత సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.