లెక్కల్లో చూపింది తక్కువ.. మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు: ఆంథోనీ ఫౌచీ

Update: 2020-05-13 13:26 GMT

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. ఎంత ఎక్కువ అన్నదీ ఇప్పుడే చెప్పలేం కానీ.. చాల మరణాలు లెక్కల్లోకి రాలేదని స్పష్టం చేశారు. న్యూయార్క్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పేషెంట్లను జాయిన్ చేసుకునేందుకు ఆసుపత్రులు కూడా ఖాళీగా లేవు. ఆ సమయంలో చాలా మంది బాధితులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారిలో కొంత మంది మృతి చెంది ఉంటారని, అవి అధికారిక లెక్కల్లోకి వచ్చి ఉండవని అన్నారు.

ఫౌచీ వ్యాఖ్యలు అమెరికాలో కరోనా తీవ్రతకు అద్ధం పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 13,99,905 మంది వైరస్ బారిన పడగా.. 83,019 మంది మృత్యువాత పడ్డారు. 2,34,607 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఆగస్టు నాటికి అమెరికాలో కోవిడ్ మరణాలు మరింత ఎక్కువ ఉండొచ్చని ఓ ప్రముఖ సంస్థ అంచనా వేసింది. సడలింపుల కారణంగా వైరస్ వ్యాప్తి మరింత పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సీయాటెల్ కేంద్రంగా పని చేస్తున్న 'ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్' అభిప్రాయపడింది.

Similar News