నేను నచ్చకపోతే కాల్చేయండి : మమతాబెనర్జీ

Update: 2020-05-25 17:49 GMT

ఆంఫన్‌ తుఫాన్‌ వెళ్లిపోయినా.. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. తుఫాన్‌ పరిస్థితులను చక్కదిద్దడంలో సీఎం మమతాబెనర్జీ ఘోరంగా విఫలమయ్యారంటూ ఆరోపిస్తోంది బీజేపీ. తుఫాన్‌ను ఎదుర్కోవడంలో మమత ముందు వరుసలో నిలిచారంటూ ప్రధాని మోదీ ప్రశంసించినా... బెంగాల్‌ బీజేపీ మాత్రం విమర్శల దాడి ఆపడం లేదు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని బయల్దేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కు .. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై మండిపడ్డారు దిలీఫ్‌ ఘోష్‌. సహాయక చర్యలను అందించడంలో విఫలమైనవారిని మాత్రమే అనుమతిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే 86 మంది మరణించి ఉండేవారే కాదన్నారు.

మరోవైపు.. గవర్నర్ జగదీప్ ధన్కర్ సైతం.. సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్‌ వల్ల నష్టం సంభవించిన మూడ్రోజులకు ఆర్మీ సహాయం అడిగారంటూ ట్వీట్టర్‌ వేదిగా విమర్శించారు. అయినా సైన్యం అతి తక్కువ సమయంలోనే అన్ని రకాల పనులను పునరుద్ధరించిందన్నారు. ఆర్మీ వల్లే ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మమత సర్కార్ త్వరగా ఆర్మీ సహాయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు ట్వీట్‌ చేశారు గవర్నర్.

అయితే ఈ విమర్శలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. ఇలాంటి విపత్తును సైతం రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ నేతలపై ఫైర్‌ అయ్యారు. ఈ సమయంలో రాజకీయాలను పక్కన పెట్టాలని అభ్యర్థించారు. ఒక వేళ నేను నచ్చకపోతే కాల్చేయండంటూ ఆవేశంగా మాట్లాడారు. అంతేకానీ.. ఇంత పెద్ద విపత్తును లబ్ధి కోసం వాడుకోవద్దన్నారు.

Similar News