పేదల కడుపు కొట్టిన ఘనత జగన్‌కే దక్కుతుంది : లోకేశ్

Update: 2020-06-08 20:41 GMT

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన అంతా మోసాలు, కుంభకోణాలు, రద్దుల పాలనగా కొనసాగిందని టీడీపీ ఘాటుగా విమర్శించింది. వైఎస్ జగన్ ఏడాది పాలనపై విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ సంవత్సర కాలంలో నవ విధ్వంసాలు, నవ మళ్లింపులు, నవ రద్దులు జరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నవరత్నాల పేరు తో గద్దెనెక్కిన జగన్, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇంతటి దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదని వైసీపీ నేతలే చెబుతున్నారని లోకేష్ గుర్తు చేశారు. రైతులకు ఏడాది కి 13 వేల 500 ఇస్తామని చెప్పి 7, 500 ఇస్తున్నారని లోకేష్ ఆరోపించారు. పెన్షన్ గురించి అడిగితే జైలుకు పంపే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నారని నారా లోకేష్ విమర్శించారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితా రాణి ఘటనలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపైనా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసులు, బెదిరింపులతో తమను భయపెట్టలేరని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

ఇంగ్లిష్ మీడియంపై వైసీపీ సర్కారు అబద్దాలు ప్రచారం చేస్తోందని నారా లోకేష్ మండిపడ్డారు. తెలుగు, ఇంగ్లిష్ రెండు మీడియంలు ఉండాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. మాతృభాషలో బోధనకు యూరప్ దేశాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంలో కోర్టులు చెప్పినప్పటికీ వైఎస్ జగన్ లెక్కచేయడం లేదని ఆరోపించారు.

మద్యం, ఇసుక, మట్టి.. ఇలా ప్రతి రంగంలోనూ అక్రమాలు పెరిగిపోయాయని నారా లోకేష్ విమర్శించారు. చివరికి, కొవిడ్-19ను కూడా క్యాష్ చేసుకున్న ఘనత జగన్‌కే దక్కిందన్నారు. టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందన్న లోకేష్, వైద్య సిబ్బందికి మాస్క్‌లే లేవని ఆరోపించారు. వైసీపీ నేతలు మాత్రం పీపీఈ కిట్లు వేసుకొని దర్జాగా బయట తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఉన్నఫళంగా రద్దు చేసి పేదల కడుపు కొట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతోందని, పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు.

Similar News