బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్‌పేట తహశీల్దార్ సుజాత అరెస్ట్ అవినీతి నిరోదక శాఖ అధికారులు అరెస్టుచేశారు. ఖాలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు ఆమెను మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఈవిచారణలో కీలకమైన ఆధారాలు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం..ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి రిమాండ్ తరలించారు. ఈ కేసులో 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీంద్ర నాయక్ ను ఇప్పటికే అరెస్టుయ్యారు.
ఈ కేసు విషయంలో షేక్ పేట మండల తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు గత మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె నివాసంలో తనిఖీలు చేయగా 30లక్షల నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఇంత డబ్బు ఎలా వచ్చింది అనేదానిమీద విచారణ జరుపనున్నారు. అయితే తహసీల్దార్ మాత్రం ఆ డబ్బంతా జీతం రూపంలో వచ్చిందేనని చెపుతున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో సర్వేనెంబర్ 17, 19లో 50 కోట్లు విలువచేసే ఎకరం భూమి తనకు ఉందని ఖలీద్ అనే వ్యక్తి అంటున్నాడు. ఈ భూమిని సర్వే చేసి ఇవ్వాలని షేక్‌పేట్ ఎమ్మార్వోకి ధరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మార్వో ఆ ధరఖాస్తును రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డికి రిఫర్ చేశారు. అయితే.. సర్వే నంబర్ 17, 19లో ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, ఖలీద్ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేశాడని షేక్‌పేట్ రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ నాయక్.. ఖలీద్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఖలీద్‌తో డీల్ కుదుర్చుకున్న నాగార్జున రెడ్డి.. భూమి సర్వే చేసి ఇస్తానని.... తనకు 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఒప్పుకున్న ఖలీద్... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఒప్పందం ప్రకారం ఖలీద్ ముందుగా 15 లక్షలను రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డికి ఇస్తుండగాఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసునుంచి తప్పిస్తానని 3లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై రవీంద్రనాయక్ నుకూడా అరెస్టుచేశారు. ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని గ్రహించిన ఏసీబీ అధికారులు షేక్ పేట తహసీల్దార్ సుజాతను ప్రశ్నించారు. లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో అమెను అరెస్టు చేశారు.