PAWAN: పిఠాపురం వచ్చి గొడవలు చేస్తే ఏరివేస్తా: పవన్‌కల్యాణ్
దేశానికి కీలకమైన శక్తిపీఠం పిఠాపురం
పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా దానిని అతిశయంగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో పెద్ద ఘటన జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలు, వక్రీకృత సమాచారం వైరల్ చేయడం తక్షణమే మానుకోవాలని ప్రజలకు, సోషల్ మీడియా వర్గాలకు హితవు పలికారు. పిఠాపురంలో నిర్వహించిన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు పిఠాపురం చిరునామాగా మారాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. “పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలు రాష్ట్రానికే కాదు.. దేశానికే గుర్తింపు తెచ్చే స్థాయికి ఎదగాలి. ఈ పండుగను అన్ని మతాలవారు, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా జరుపుకునేలా అభివృద్ధి చేయాలి” అని సూచించారు. అలాగే తెలంగాణ ప్రజలతో ఆంధ్ర ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. “తెలంగాణలో ఉన్న మన ఆడబిడ్డలను సంక్రాంతికి పిఠాపురానికి ఆహ్వానించాలి. గోదావరి జిల్లాల ఆతిథ్య సంస్కృతిని వారికి పరిచయం చేయాలి. మన సంప్రదాయాలు, మన సంస్కృతి ఎంత గొప్పవో దేశానికి తెలియజేయాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు. సంక్రాంతి అంటే కేవలం కోడిపందేలు, జూదాలు మాత్రమే అన్న భావనను దాటాలని ఆయన పిలుపునిచ్చారు. “సంక్రాంతిలో సరదాలు ఉండాలి. వాటిని నేను కాదనడం లేదు. చేసేవాళ్లు చేసుకోండి. కానీ పండుగ ఆత్మ వాటికే పరిమితం కాకూడదు. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ బంధాలు, ఆత్మీయత అన్నీ సంక్రాంతిలో ప్రతిబింబించాలి” అని స్పష్టం చేశారు.
దేశానికి కీలకమైన శక్తిపీఠం పిఠాపురం
పిఠాపురాన్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. “పిఠాపురం దేశానికి చాలా కీలకమైన శక్తిపీఠం. శ్రీపాద శ్రీ వల్లభుడు వెలసిన పవిత్రమైన నేల ఇది. ఇలాంటి ప్రాంతం నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నాను” అని చెప్పారు. పిఠాపురం అభివృద్ధి కోసం ఇప్పటికే అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. “ప్రజలు నన్ను మరింత బలపరిస్తే పిఠాపురం కోసం ఇంకా ఎక్కువగా పనిచేస్తాను. అధికారంలో ఉన్నా లేకపోయినా.. నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల కోసమే నిలబడతాను” అని హామీ ఇచ్చారు. పిఠాపురం అభివృద్ధి తన రాజకీయ జీవితంలో ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మీడియా తీరుపై కూడా పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇతర ప్రాంతాల్లో పెద్ద నేరాలు జరిగినా అవి పెద్ద వార్తలు కావు. కానీ పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. ఇది సరికాదు” అని అన్నారు. పిఠాపురాన్ని కావాలనే టార్గెట్ చేసి చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పిఠాపురానికి వచ్చి గొడవలు చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. “పిఠాపురంలో అశాంతి సృష్టించాలనుకుంటే ఇక్కడే కూర్చొని అడ్డుకుంటాను. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు” అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దూషణలు, అక్రమ కేసులు పెట్టే సంస్కృతి కొనసాగిందని విమర్శించారు. మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. “శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదు” అని హెచ్చరించారు. తన మాటలు మెత్తగా అనిపించినా, అవసరమైతే చాలా గట్టిగా, వ్యక్తిగతంగా స్పందిస్తానని పవన్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన నాయకత్వం అవసరమని, ఆ దిశగా కూటమి నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “పొత్తులను బలహీనపరిచే ప్రయత్నాలు చేయవద్దు. ఐక్యతే మన బలం” అని స్పష్టం చేశారు.