కరోనా ప్రభావంతో మరింత మంది ఆకలితో అలమటిస్తున్నారు: ఐక్యరాజ్య సమితి

Update: 2020-06-10 17:53 GMT

కరోనా మహమ్మారి వలన ఏర్పడిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై పెను ప్రభావం పడనుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కరోనా సృష్ఠించిన కలకలంతో మరో 4.9 కోట్ల మంది తీవ్రపేదరికంలోకి జారుకుంటారని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం అన్ని దేశాలు సత్వరమే పూనుకోవాలని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. లేకపోతే.. అంతర్జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడి కోట్లాది ప్రజలపై తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభా 780 కోట్ల మంది ఆకలిని తీర్చేందుకు సరిపడే ఆహారం ప్రపంచంలో ఉందని... అయినప్పటికీ 82 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్ అన్నారు. మన ఆహార వ్యవస్థలు విఫలం కావడంవలనే ఈ పరిస్థతి ఏర్పడిందని.. అయితే, కరోనాతో ఇది మరింత దిగజారిందని ఆంటోనియా గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో పుష్కలంగా ఆహారపు నిల్వలు ఉన్నా.. వాటిని సరఫరా చేసే వ్యవస్థల్లో పలు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 14కోట్లమంది చిన్నారులకు ఆహారం అందుబాటులో లేదని.. ప్రతీ ఐదుగురులో ఒకరు క్షుద్భాద అనుభవిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రత కొరవడిన దేశాలకు ఆహారం అందుబాటులోని తీసుకొచ్చేలా ప్రపంచదేశాలు చొరవచూపాలని ఆంటోనియా గుటెరస్ కోరారు.

Similar News