శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్న చైనా
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్న చైనాకు.. అదే రీతిలో సమాధానం చెప్పేందుకు భారత్ కూడా రెడీ అవుతోంది. ఈ మేరకు 3 వేల 488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ వెంట భారత్ కూడా సైన్యాన్ని తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇండియన్ ఆర్మీతోపాటు.. ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌ను కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మిలిటరీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్ ఎస్.ఎస్.దేస్వాల్‌లు శనివారం లేహ్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
గల్వాన్ ఘటనకు ముందే కొన్ని బలగాలను లద్దాఖ్‌ను తరలించామని.. ఇప్పుడు ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్టు.. ఆర్మీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రతి గస్తీ పాయింట్ వద్ద సైన్యానికి తోడుగా ప్లాటూన్‌కు బదులు కంపెనీలను ఉంచాలని నిర్ణయించారు. ఒక ప్లాటూన్‌లో 30 మంది జవాన్లు ఉంటే.. అదే ఒక కంపెనీలో 100 మంది జవాన్లు.. సైన్యానికి సపోర్ట్‌గా ఉంటారు.
జాతీయ భద్రతా మండలికి అందిన నివేదికల ప్రకారం... సరిహద్దుల్లోని గల్వాన్ లోయ, హాట్‌స్ప్రింగ్, పాంగాంగ్ లేక్ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ఏప్రిల్ 30, 2020 నాటి యథాస్థితిని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని మోల్డోలో జరిగిన సైనిక జనరల్స్ చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు గల్వాన్ లోయ, గోగ్రాలోని గస్తీ పాయింట్లు 14,15,17 వద్ద బలగాలను తగ్గించాలని రెండు వర్గాలు సరస్పరం కోరినట్టు తెలుస్తోంది.
అయితే చైనా పైకి శాంతి అంటూ జపిస్తున్నా.. బుధవారం నాటి శాటిలైట్ చిత్రాల్లో.. మాత్రం.. గల్వాన్ లోయలోకి 14 నంబర్ గస్తీ పాయింట్ వద్ద చైనా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. దాంతోపాటు గస్తీ పాయింట్ 15 వద్ద భారీగా టెంట్లు వేసి తిష్టవేశాయి. అలాగే గస్తీ పాయింట్ 17 వద్ద పెద్ద ఎత్తున చైనా బలగాలను మోహరించినట్టు సమాచారం. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితులకు సంబంధించి అందిన నివేదిక ప్రకారం చైనా బలగాలు ఫింగర్ 4 వరకు వచ్చినట్టు తెలుస్తోంది. చైనాతో భారత్ సైనిక, ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందుస్తు సన్నద్ధత చేస్తున్నారు.
భారత్, చైనా సైన్యాలు ఘర్షణ పడ్డ గల్వాన్ లోయలో సైనిక బలగాలు వెనక్కి మరలినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో డ్రాగన్ సైనికలు, వాహనాల సంఖ్యలో తగ్గుదల ఉన్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. చైనా ఆర్మీ.. అంతకుముందుతో పోలిస్తే.. కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయారు. LAC వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల అత్యున్నత సైనిక, దౌత్య సమావేశాల తర్వాత.. చైనీయులు కొంత వెనక్కి తగ్గడం ఇదే తొలిసారి.