Fertilizer Crisis : పశ్చిమ ఆసియాలో రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం చమురు బావులకే పరిమితం కావడం లేదు. ఈ యుద్ధం వల్ల త్వరలోనే మీ వంటగదిలోని కంచం ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ ధరల గురించే అందరూ చర్చించుకుంటున్నారు, కానీ అంతకు మించిన భయంకరమైన గండం ఒకటి ముంచుకొస్తోంది. అదే ఎరువుల సంక్షోభం. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోతే, అది ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ కానుంది.
మధ్యప్రాచ్యం అనగానే మనకు పెట్రోల్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, యూఏఈ దేశాలు ప్రపంచానికి యూరియా, సల్ఫర్, అమ్మోనియాను సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాలు. ఒక్క ఇరాన్ దేశమే ప్రపంచంలో మూడవ అతిపెద్ద అమ్మోనియా ఉత్పత్తిదారు. పంటలకు ప్రాణాధారమైన ఎరువుల తయారీలో ఈ రసాయనాలే కీలకం. ఇప్పుడు యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోతే, ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడతాయి. దీనివల్ల సాగు సీజన్ మొదలయ్యే సమయానికి రైతులకు ఎరువులు అందవు. ఫలితంగా పంటల దిగుబడి తగ్గి, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతాయి.
యుద్ధం తెచ్చిన టెన్షన్ మార్కెట్లో అప్పుడే కనిపిస్తోంది. యూరప్‌లో అమ్మోనియా ధర టన్నుకు 725 డాలర్లకు చేరింది. గల్ఫ్ దేశాల్లో యూరియా ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఉన్న రష్యా ఎరువుల సరఫరా పెంచుతుందని ఆశించినా, అక్కడి ఉత్పత్తి సామర్థ్యం సరిపోవడం లేదు. అటు చైనా ఇప్పటికే ఫాస్ఫేట్ ఎగుమతులపై నిషేధం విధించింది. ఖతార్‌లో సల్ఫర్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇలా అన్ని వైపుల నుంచి ఎరువుల కొరత ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో గందరగోళం నెలకొంది.
భారతదేశం తన ఎరువుల అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. మనం ప్రతి నెలా సుమారు 20 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుంటాం. పొటాష్ విషయంలో 100 శాతం, డీఏపీ విషయంలో 60 శాతం ఇతర దేశాలదే భరోసా. గత ఏడాదిలోనే భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తాజా పరిస్థితుల వల్ల యూరియా ధరలు 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
దీనివల్ల రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి.. ప్రభుత్వంపై సబ్సిడీ భారం విపరీతంగా పెరగడం, లేదా.. రైతులు ఎరువుల కోసం ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి రావడం. ఎరువులు ప్రియమైతే రైతులు తక్కువగా వాడుతారు, దానివల్ల దిగుబడి తగ్గి మార్కెట్‌కు ధాన్యం తక్కువగా వస్తుంది. వెరసి, గల్ఫ్ యుద్ధం నేరుగా సామాన్యుడి కంచంపై ప్రభావం చూపబోతోంది.