అందరూ మాటలు చెప్పేవాళ్లే. అవసరానికి అప్పడిగితే మొహం చాటేస్తారు. వాళ్లకి కావలసినప్పుడు మాత్రం బాధలన్నీ తనకి ఒక్కడికే ఉన్నట్టు ఫేస్ పెట్టి అడిగేసరికి.. కాదనలేక ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఈ బాధలన్నిటికీ స్వస్తి. ఎందుకంటే ఇప్పుడు 'గూగుల్ పే' మీకు అప్పిస్తానంటూ ముందుకొస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తక్కువ వడ్డీకే ఇన్ స్టాంట్ రుణాలనిచ్చేందుకు రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం కొన్ని బ్యాంకులతో గూగుల్ పే ఒప్పందం చేసుకోనుంది. ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన అనంతరం మొదటి దశలో పాతిక లక్షల మంది వినియోగదారులకు రుణాలివ్వాలని గూగుల్ యోచిస్తోంది. అయితే ఈ రుణాల షెడ్యూల్ ఎలా ఉండాలి అన్నదానిపై సంస్థ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు.. కోటక్ మహీంద్ర, ఫెడరల్, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ తదితర బ్యాంకులతో గూగుల్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక గూగుల్ పే రుణసౌకర్యం ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.