పైలెట్ గా, యూట్యూబర్ గా, ఓ చిన్నారికి తల్లిగా.. అన్ని పాత్రలు అవలీలగా..

Update: 2020-06-27 15:26 GMT

ఆడపిల్ల.. ఆకాశంలో పైలెట్టా.. పెళ్లి చేసి పంపించక ఎందుకు ఆ చదువులు అన్న బంధువులు సైతం రీతూని చూసి నేర్చుకోమని పిల్లలకు చెప్పే స్థాయికి చేరుకుంది ముంబయికి చెందిన రీతూ రథి తనెజా. పైలెట్ గా ఆకాశం అంచులు చూసొచ్చింది. అంతకు వంద రెట్లు యూట్యూబర్ గా ఎదిగి 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఓ మంచి ఇల్లాలిగా, ఓ చిన్నారికి తల్లిగా అన్ని పాత్రలు అవలీలగా పోషించేస్తోంది. తను కోరుకున్న జీవితాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది. అయితే ఇవన్నీ అనుకున్నంత సులువుగా దక్కలేదు రీతూకి. ఎన్నో ఆటు పోట్లు.. మరెన్నో అడ్డంకులు.. అన్నింటినీ అధిగమించి సాటి మహిళకు ఆదర్శంగా నిలుస్తోంది.

బంధువులు ఎన్ని అన్నా బాగా చదివించాలనుకున్నారు తల్లిదండ్రులు రీతూని. పాఠశాలలో చదువుకునే క్రమంలో స్నేహితురాలు పైలెట్ అవమని సలహా ఇవ్వడంతో దానిపై ఇష్టం పెంచుకుంది. చదువుపై మరింత శ్రద్ధ పెట్టింది. అనంతరం అమెరికాలో పైలెట్ శిక్షణకు దరఖాస్తు చేసుకుంది. కూతురుని అంత దూరం పంపించడం ఇష్టం లేదు.. పైగా చాలా డబ్బు కూడా ఖర్చవుతుందని వద్దన్నారు తల్లిదండ్రులు. అయినా రీతూ తన పెళ్లి కోసం దాచిన డబ్బుతో అమెరికాలో చదువుకుంటానని పట్టుబట్టింది. దాంతో అమ్మానాన్న.. అమ్మాయిని అమెరికా పంపించక తప్పని పరిస్థితి.

అమెరికాలో ఏడాది శిక్షణ అనంతరం రీతూ భారత్ కు తిరిగివచ్చింది. ఇక్కడ ఎంత ప్రయత్నించినా పైలెట్ ఉద్యోగం దొరకలేదు. దాంతో బంధువులు మరోసారి అనడానికి అవకాశం తీసుకున్నారు. అండగా నిలిచిన తల్లి మెదడుకు సంబంధించిన వ్యాధితో కన్నుమూసింది. తండ్రి కృంగిపోయారు. ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత కష్టంలోనూ రీతూ పోటీ పరీక్షలకు సిద్దమై ఓ ఎయిర్ లైన్స్ లో కో-పైలెట్ ఉద్యోగం సంపాదించింది. నాలుగు నెలల్లో 60కి పైగా విమానాలు నడిపి తక్కువ కాలంలోనే పైలెట్ గా ప్రమోషన్ పొందింది. పైలెట్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే మరో పైలెట్ తో పరిచయం పెళ్లికి దారితీసింది. అనంతరం వారికి ఓ పాప.

ఈ క్రమంలోనే భర్త సహకారంతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది రీతూ. ఇందులో వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలు, సరదాలు, సంతోషాలు ఒకటేమిటి అన్నింటినీ షేర్ చేసింది. ఊహించని విధంగా ఛానెల్ క్లిక్ అయింది. 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ని సంపాదించుకుంది. నా కూతురు కెప్టెన్ అని నాన్న చెప్పుకుంటున్న ప్రతి సారి ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తాను. నేను కేవలం కెప్టెన్ నే కాదు, యూట్యూబర్ ని , భార్యని, ఓ తల్లిని.. నేను చేసే పనులపై ఎవరూ పరిమితులు విధించలేరు.. మన లక్ష్యం, మన ఆశయం మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది అని రీతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

Similar News