మహమ్మారి కరోనా కార్మికుల పొట్ట కొడుతోంది. కరోనా కలకలంతో బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ లో కేసుల సంఖ్య 400 కి పెరిగింది. దీంతో కార్మికులు ప్లాంట్ కు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ను కొన్ని రోజులు మూసి ఉంచాలనే డిమాండ్ కొనసాగుతోంది.
కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో ఓ వారం 10 రోజుల పాటు ప్లాంట్ లో పని నిలిపివేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ప్లాంట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని అంటున్నారు. అవసరమైతే నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు పని చేయించుకోమని కోరినట్లు వర్కర్స్ యూనియన్ తెలిపింది. ఈ ప్లాంట్ లో 8,100 మందికి పైగా కార్మికులు పని చేస్తుంటారు. కోవిడ్ కారణంగా ఏడుగురు కార్మికులు మరణించారు.