దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ భవనం వద్ద భద్రతా లోపం బయటపడింది. ఓ వ్యక్తి చెట్లు ఎక్కి, గోడ దూకి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఇవాళ ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ చొరబాటుదారుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పార్లమెంట్ భవనం భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. భద్రతా దళాలు ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఉద్దేశ్యాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.