మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో కేబినెట్ మంత్రికి కరోనా సోకింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మంత్రి అస్లాం షేక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతానికి తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయనను ఇటీవల కలిసిన వారంతా.. కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి అభ్యర్థించారు. రాష్ట్ర ప్రజలకు ఇంటి నుంచే సేవ చేస్తానని అస్లాం షేక్ పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 9,518 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 258 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,10,455 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 11,854 మంది ప్రాణాలు కోల్పోయారు.