ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలతో ఎస్‌బీఐ కార్డ్స్ మంగళవారం దూసుకెళ్తోంది. ఇంట్రాడేలో షేర్ 6 శాతం పైగా లాభపడి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి(రూ.794.50)ని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 16న లిస్ట్ అయిన ఈ సంస్థ ఇష్యూ ధర రూ.750. అయితే కోవిడ్-19 సంక్షోభంతో ప్రారంభంలో నిరుత్సాహకరంగా కదలాడిన ఈ షేర్, గత నెలరోజులుగా చక్కని ప్రదర్శనను నమోదు చేస్తూ మంగళవారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది.
ఈ కంపెనీని దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ ప్రమోట్ చేస్తోంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.346 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 52శాతం వృద్ధితో రూ.747 కోట్ల నుంచి రూ.1138 కోట్లకు ఎగబాకింది. కంపెనీ నిరర్ధక ఆస్తులు కూడా తగ్గాయి. కంపెనీ ప్రొవిజన్లు 42 శాతం క్షీణించాయి. ఈ స్టాక్‌కు బ్రోకరేజీ సంస్థలు BUY రేటింగ్‌నిచ్చాయి. 12 నెలల టార్గెట్ ధరను రూ.974గా నిర్ణయించాయి.