ఆశల పల్లకిలో వాహన రంగం

Update: 2020-07-23 08:47 GMT

సంక్షోభం నుంచి ఆయా రంగాలు ఇప్పడిప్పడే బయటపడుతున్నాయి. ఆటో రంగం కూడా కోలుకుంటోంది. ముఖ్యంగా ద్విచక్రవాహన కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు ప్రొడక్షన్ పెంచాలని నిర్ణయించాయి. దేశీయ సంస్థలైన హీరో, బజాజ్ కంపెనీలు ఉత్పత్తి భారీగా పెంచుతున్నాయి. అన్ లాక్ తర్వాత క్రమంగా వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో ఎంక్వేరీలు పెరిగాయి. షోరూములకు జనాలు క్యూకడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడం.. సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లు మళ్లీ ఉపందుకున్నాయి. పైగా ఫెస్టివ్ సీజన్ కూడా కావడంతో కంపెనీలు కొత్తకొత్త ఉత్పత్తులతో సిద్దమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లో దారుణంగా ఉన్న ఉత్పత్తి జూన్ నుంచి క్రమంగా పెంచుతూ వచ్చాయి.

ఎంట్రీ లెవల్ టూ వీలర్ కు భారీగా డిమాండ్ పెరిగినట్టు రీసెంట్ సర్వేలు చెబుతున్నాయి. హీరో కంపెనీ మేలో కేవలం లక్షా 12వేల వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేసింది. అయితే మ్యాన్ పవర్ లేకపోవడం.. లాక్ డౌన్ ఆంక్షలు ఇందుకు ప్రధానకారణం. అయితే డిమాండ్ కూడా లేదు. జూన్ నుంచి మళ్లీ ప్రొడక్షన్ పెంచడం మొదలుపెట్టింది. జూన్ లో 4లక్షల 50వేల 744 యూనిట్లు డీలర్లకు అందించింది. సాధారణంగా హీరో కంపెనీ ప్రతి నెలా 5లక్షల వరకూ ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ వచ్చే నెలలో ఏకంగా 7లక్షల ప్రొడక్షన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2018లో ఈ స్థాయిలో ఉత్పత్తి చేసిన చరిత్ర హీరో సంస్థకు ఉంది. అటు బజాజ్ కూడా ఆగస్టు నుంచి 3లక్షల 20వేలకు పైగా వాహనాలకు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. లాక్ డౌన్ కారణంగా బజాజ్ కూడా మేలో లక్షా 12వేలు మాత్రమే డిస్పాచ్ చేస్తే.. జూన్ నాటికి దీనిని 2లక్షల 55వేలకు పెంచింది. సాధారణంగా ఫెస్టీవ్ సీజన్ లో డిమాండ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం జులై నుంచే వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని.. అందుకే కోవిడ్ 19కు ముందు కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి.

వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఆటోరంగానికి కొత్త కళ వచ్చింది. గతంలో BS6 , కోవిడ్ 19 వరసగా వచ్చిన సంక్షోభాలు పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. నష్టాలతో మూతపడ్డ షోరూములు వందల్లో ఉన్నాయి. కానీ అనూహ్యంగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరగడంతో కంపెనీలకు మళ్లీ పూర్వ వైభవం వస్తోంది. మార్కెట్లో షేర్లు కూడా కళకళలాడుతున్నాయి. వాహన అమ్మకాలు పెరిగాయి. లాభాలు చూస్తున్నాయి. దీంతో మార్కెట్లో షేర్లు నిలకడగా రాణిస్తున్నాయి. ఇది ఆటో రంగానికి మంచిసూచికే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

Similar News