కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన కేఫ్ కాఫీ డే(CCD)అధినేత వీజీ సిద్దార్థ ఆత్మహత్య కేసులో విచారణ దాదాపు పూర్తి కావొచ్చింది. CBI రిటైర్డ్ డీజీ అశోక్ కుమార్ మల్హోత్ర, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేష్ నేత్రుత్వంలో ప్రత్యేక విచారణ కమిటీ నియమించారు. ఈ మొత్తం వ్యవహారంపై 11 నెలల పాటు విచారణ జరిపిన కమిటీ సిద్దార్థ ఆత్మహత్యకు గల కారణాలపై నివేదిక ఇచ్చింది. ఆరోపణలు వచ్చినట్టుగా ప్రైవేటు ఈక్విటీ లు నిబంధనలకు విరుద్దంగా సిద్దార్థపై ఒత్తిడి తీసుకరాలేదని.. ఆత్మహత్యకు వారు కారణం కాదని ఇన్వెస్టిగేషన్ కమిటీ స్పష్టం చేసింది. నిబంధలనకు అనుగుణంగానే, మార్కెట్ అనుసరిస్తున్న పద్దతుల్లోనే రీపేమెంట్ విషయంలో PEలు సిద్దార్థను సంప్రదించారని తేలింది. దీంతో ఈ కేసులో PEలకు క్లీన్ చిట్ వచ్చినట్టే. కంపెనీలో ఉన్న ఆర్థిక పరమైన లోపాలను కప్పిపుచ్చి సిద్దార్థ భారీ ఎత్తున వ్యక్తిగత సెక్యూరిటిలు పెట్టి.. రుణాలు సేకరించినట్టు తెలుస్తోంది. కంపెనీలో ఆడిటర్లు, ఉద్యోగులు, చివరకు కుటుంబసభ్యులకు కూడా అప్పుల విషయం తెలియదని తేలింది. పూర్తి బాధ్యత తనదేనని సూసైడ్ నోట్లో కూడా రాశారు సిద్దార్థ. విచారణలో కూడా వ్యక్తిగతంగా చేసిన అప్పుల విషయం బయటపడింది. చేసిన అప్పులే ఆయన్ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు తెలుస్తోంది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు 49 సబ్సిడరీ కంపెనీలున్నాయి. గత ఏడాది జులైలో సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు30న విచారణ మొదలైంది.