ఎట్టకేలకు బడి అయితే తెరుచుకుంటోంది కానీ విద్యార్థులు పాఠశాలకు రాకూడదు. తల్లిదండ్రులు వచ్చి పిల్లల చదువుకు సంబంధించిన విషయాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందని ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేసింది. సోమవారం (27) నుంచి అడ్మిషన్లు మొదలవుతాయి. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 4 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వారానికి ఒకసారి మాత్రమే ఉపాధ్యాయుడు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. శనివార 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్ దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యా క్యాలెండర్ లో ముఖ్యాంశాలు..
ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార సాధనాలు అందుబాటులో లేని వారిపై దృష్టి పెట్టే విధంగా టీచర్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలను వినియోగించుకోవచ్చు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న ఉపాధ్యాయులు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పాఠశాలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. క్యాలెండర్ లో సూచించిన విధంగా ప్రతి టీచర్ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలి. వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.