ANGRAU Construction Incompleted: ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్
పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందన్న సమాచారంతోలేని అభివృద్ధి ఉన్నట్లు చూపి ప్రజలను మభ్య పెట్టేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. సొంత గొప్పలు చెప్పుకోడానికి పనులు పూర్తి కాకపోయినా భవనాలు ప్రారంభించేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన భవన ప్రారంభించడమే దీనికి నిదర్శనం. కనీసం కార్యాలయం అద్దాలు అమర్చకుండానే, విద్యుత్ ఉపకరణాలు ఏర్పాటు చేయకుండానే సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. అదే సమయంలో కేంద్ర నిధులతో నిర్మిస్తున్న భవనాల ప్రారంభానికి ఎవరినీ పిలవకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ... అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వర్సిటీ ఏర్పాటు కోసం 516 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణానికి 15 వందల కోట్లతో డీపీఆర్ రూపొందించి..... కేంద్రానికి పంపించారు. కేంద్రం తొలి దశలో 135 కోట్లు ఇచ్చింది. ఇందులో 110కోట్లతో ప్రధాన పరిపాలనా భవనం నిర్మాణం ప్రారంభించారు. జీ+9 విధానంలో రెండు టవర్లు U ఆకారంలో ఉండేలా భవనాన్ని నిర్మించేందుకు 2018 అక్టోబరు 15న పనులు ప్రారంభించారు. 2020 జనవరి 14 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.... వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇంజినీరింగ్ పనులు నిలుపుదల, ఆ తర్వాత ఇసుక కొరతతో పనులు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వర్సిటీ పనులను పరిశీలించి.... జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చి 6వ తేదీ నాటికి 90 శాతం పనులు మాత్రమే పూర్తి అయినప్పటికీ భవనాన్ని ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్శిటీ ఇంఛార్జి ఉపకులపతి శారదా జయలక్ష్మీ దేవి మాత్రం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు..
సీఎం ప్రారంభిస్తున్న సమయంలోనూ కార్మికులు పనులు చేస్తున్నారు. ముఖ్యమైన సివిల్ పనులు తప్పభవనంలో కనీసం అద్దాలు బిగించలేదు. దీంతో అద్దాలు బిగించని ప్రాంతం కళావిహీనంగా కనిపిస్తోంది. వివిధ విభాగాల కోసం చేపట్టాల్సిన పనులూ జరగలేదు. కరెంట్ వైరింగ్ పనులు ఇంకా చేస్తున్నారు. యూనివర్శిటి కార్యకలాపాలకు ఎంతో ముఖ్యమైన ఆడిటోరియం పనులూ పూర్తి కాలేదు. ప్రధాన వేదిక, ఎలక్ట్రిసిటీ, సౌండ్, ఇంటీరియర్ పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. భవనం లోపల రంగులు వేసే పనులు పూర్తి కాలేదు. కొన్ని అంతస్థుల్లో ఫ్లోరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. కీలకమైన పనులు పెండింగ్‌లో ఉన్నాపట్టించుకోకుండా సీఎం వర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నాతాధికారులు ఎవరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. దీంతో శిలాఫలకంపై తమ పేరుంటే చాలని సీఎం, మంత్రి భావించినట్లున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీకి నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అసలు ఎలా ప్రారంభిస్తారని భాజపా నేతలు మండిపడుతున్నారు