BJP: బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు
మహాదేవప్ప ఆత్మహత్యతో రాజకీయ కలకలం... కాంగ్రెస్ పార్టీపై మండిపడిన కమలం పార్టీ... కాంగ్రెస్ వేధింపులతోనే ఆత్మహత్యన్న బీజేపీ
మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కలకలం రేపుతోంది. మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
మండిపడ్డ బండి సంజయ్
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో మక్తల్ 6వ వార్డు ఎన్నిక రద్దు చేశారు. మహదేవప్ప మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నేడు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణం ఆత్మహత్య కాదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ హత్య అని బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని, తమ సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని, ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచకాలకు చరమగీతం పాడుతామని వారి ఆటలు సాగనివ్వబోమని బండి సంజయ్ తెలిపారు.
విచారణకు డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్తి మహదేవప్ప మృతి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి చావుకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బీజేపీ నేత మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. క్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహదేవప్ప బలవన్మరణం కేవలం ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత రాజకీయాలు, మాఫియా బెదిరింపుల వల్ల జరిగిన దారుణమని ఆయన ఆరోపించారు. మంత్రి వాకిటి శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఆందోళన.. ఉద్రిక్తత
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైన మంత్రి వాకిటి శ్రీహరిని తక్షణమే తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించాలని, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని రామచందర్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు.