ACP Uma Maheshwar Rao: కళ్లుచెదిరే ఆస్తులు, బయటపడుతోన్న అక్రమ భాగోతాలు

ACB అధికారులకు అందిన కీలక విషయాలు

Update: 2024-05-24 02:30 GMT

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన CCS ACP ఉమామహేశ్వరావు కేసు దర్యాప్తులో ACB అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ACP ఆస్తులు చిట్టా బయటపడగా  8రోజుల కష్టడి కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు  దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్‌పేట్‌లోని R.S. కన్‌స్ట్రక్షన్‌లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4వేల400 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం 50లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. 2017లో జవహర్‌నగర్ అయ్యప్ప నగర్‌ కాలనీ సమీపంలో 255 సర్వేనంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 10 లక్షలు చెల్లించగా ఇది మదన్మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 19లక్షల 90వేల 250 రూపాయలు చెల్లించి తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్‌ను మామ సతీశ్‌బాబు పేరిట 2020లో రిజిస్టర్‌ చేయించి, దీనికోసం సుమారు 37లక్షల 54వేలు చెల్లించినట్లు గుర్తించినట్లు  సోదాల్లో గుర్తించారు.

శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలో సర్వేనంబర్‌ 530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.2018లో శామీర్‌పేట్‌లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని అశోకా ఒర్నాట ఆపార్ట్‌మెంట్‌లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్‌పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ప్లాట్‌ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో ఏడున్నర లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని. మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు. చోడవరం న్యూ శాంతినగర్ కో-ఆపరేటివ్ కాలనీలో 4లక్షల 80వేల విలువైన 240 చదరపు గజాల ప్లాటును  2014లో సతీశ్‌బాబు పేరిట కొన్నారు. చోడవరం మండలం దొండపూడి గ్రామంలో 209 సర్వే నంబర్లో 5.92 ఎకరాల స్థలాన్ని 2021లో 32లక్షల 56 వేలు వెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు.

అదే ఏడాది అక్కడే మరో 2.2ఎకరాల స్థలాన్ని 12లక్షల 10వేలకు కొన్నారు. 3లక్షల 62వేల విలువైన గృహసామగ్రి 2లక్షల 4వేల విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లక్షా 40వేల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్‌లో మరో DSP ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయంశంగా మారింది. బర్కత్‌పురా హౌసింగ్‌ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని TS సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్‌రెడ్డి ఫ్లాట్‌లోనూ ACB అధికారులు సోదాలు నిర్వహించారు.   

Tags:    

Similar News