AMARAVATHI: అమరావతిలో బిట్స్‌ పిలానీ క్యాంపస్‌

ఒప్పందం కుదుర్చుకున్న సీఆర్డీఏ

Update: 2026-01-31 07:30 GMT

అమరావతి ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వేళ మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ చేరికతో విద్యారంగంలో కీలక ముందడుగు పడింది. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటైన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) అమరావతిలో తన నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏపీ సీఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మందడం, వెంకటపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో మొత్తం 70.011 ఎకరాల భూమిలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం మందడం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ తరఫున అధీకృత ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో అమరావతిలో ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు మరింత ఊపొస్తుందని అధికారులు భావిస్తున్నారు.

బిట్స్ పిలానీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి క్యాంపస్ అభివృద్ధిని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలోనే రూ.1000 కోట్ల పెట్టుబడితో ఆధునిక స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సేవలు, నూతన బోధనా పద్ధతులకు అనుగుణంగా పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ క్యాంపస్‌ను భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కొత్తతరం విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంస్థ అధికారులు వెల్లడించారు. క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి 2027 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దశల వారీగా సుమారు 10 వేల మంది విద్యార్థులు అభ్యసించే సామర్థ్యం గల క్యాంపస్‌గా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీతో పాటు ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా ఈ క్యాంపస్ మారనుందని అంచనా వేస్తున్నారు.

అమరావతిలో బిట్స్ పిలానీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనతో రాజధాని ప్రాంతానికి విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, దేశవ్యాప్తంగా విద్యార్థులు అమరావతి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా ఇది మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Tags:    

Similar News