AMARAVATHI: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం
పెట్టుబడులే లక్ష్యంగా యూఏఈలో చంద్రబాబు పర్యటన.. శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌తో చంద్రబాబు భేటీ.. దుబాయ్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సీఎం
పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో అధునాతన లైబ్రరీ నిర్మాణం కోసం శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా శోభా గ్రూప్ ఛైర్మన్‌ను చంద్రబాబు అభినందించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని ఆహ్వానించారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సీఎం సమావేశం అయ్యారు. మూడు రోజుల చంద్రబాబు దుబాయ్, యూఏఐల్లో పర్యటిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో మూడు, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో పాల్గొంటారు.
అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపిన సీఎం..రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌ను కోరారు.శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని పేర్కొన్నారు.
దుబాయ్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సులో..
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను మంత్రులు, అధికారులతో కలిసి చంద్రబాబు సందర్శించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి మ్యూజియంలో ప్రదర్శణలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వివరించారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్సీపీరియన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. దుబాయిలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. అక్కడి పెట్టుబడిదారులతో ఏపీలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు వివరించారు. తిరుపతి, విశాఖ, అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు.