AP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో అసలైన ఆట
రాజీనామాలు సమర్పించిన ప్రస్తుత కార్యవర్గం... ఈ నెల రోజుల్లోనే ఎన్నికలు;
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం రాజీనామాలు సమర్పించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రాజీనామాలు ఇచ్చారు. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయని కేశినేని చిన్ని తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఆఫీసర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. త్వరలో ఏసీఏ పాలకవర్గం ఎన్నికకు ఏర్పాట్లు జరగబోతున్నాయని అన్నారు. ఏసీపీ ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పాత బోర్డ్ సభ్యుల ఒక్కసారిగా చేసిన రాజీనామాలు ఆమోదించామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వారు ఏసీఏకి చేసిన సేవలకు కృతజ్ఞతగా సన్మానించాం.. ఈ నెల రోజులు ఏసీఏ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని ఎంపీ ప్రకటించారు.
ఈ కమిటీలో ఆర్వీ ఎస్కే రంగరావు, మ్యాన్ చో ఫేరార్, జాగర్ల మూడి మురళీ మోహన్ రావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో క్రికెట్ స్టేడియాల పరిస్థితిపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పుకొచ్చారు. క్రికెట్ క్రీడాకారుల సదుపాయలపై కూడా సర్వసభ్య సమావేశంలో మాట్లాడినట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఏసీఏ అధ్యక్షులుగా అరబిందో గ్రూప్‌నకు చెందిన పి శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి నిందితునిగా ఉన్నారు. తర్వాత అప్రూవర్ గా మారారు. ఉపాధ్యక్షులు ఆయన సోదరుడు పి రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు. ఇక ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, సహాయ కార్యదర్శి రాకేష్, కోశాధికారి ఎవి చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పురుషోత్తంలు ఉన్నారు. వీరంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో పని చేస్తారని చెబుతూంటారు. ఇప్పుడు వీరంతా రాజీనామా చేశారు. క్రికెట్ అసోసియేన్‌లో మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నకల్లో గెలిచిన వారు మూడేళ్లు అసోసియేషన్ పాలకవర్గంగా ఉంటారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. అయినా వీరంతా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు.కొత్త కార్యవర్గం ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.
రాజకీయ ఆట
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదు. బీసీసీఐ నియంత్రణలో ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రూపాయి నిధులు. ప్రభుత్వ కార్యక్రమాలేవీ ఏసీఏ చేపట్టదు. ఏసీఏ కిందట రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అసోసియేషన్‌లు, 31 పట్టణాల్లో క్రికెట్ క్లబ్సులు ఉన్నాయి. వీరిలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, మరికొందరు సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్లకు ఓట్లు ఉంటాయి. గతంలో గోకరాజు గంగరాజు వంటి పారిశ్రామికవేత్తలు, చాముండేశ్వరి నాథ్ వంటి మాజీ క్రికెటర్లు ఏసీఏను నడిపించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. పాత వాళ్లు పట్టించకోవడం మానేశారు.