AP BUDGET: భారీ అంచనాలు, ఆశల మధ్య నేడే ఏపీ బడ్జెట్
ఏపీ బడ్జెట్.. రూ.3.48 లక్షల కోట్ల అంచనా.. ఉదయం 11:45కి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేశవ్... ఎన్నికల హామీలపైనే దృష్టి పెట్టనున్న బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను నేడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈసారి బడ్జెట్ మొత్తం పరిమాణం దాదాపు రూ.3.45 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశానికి ముందు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2026–27 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఉదయం 11.10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమై, 11.15 గంటలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు. ఇదే సమయంలో శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం 12.50 గంటలకు వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనుండగా, మండలిలో వ్యవసాయ పద్దును మంత్రి నారాయణ ఉంచనున్నారు.
అభివృద్ధి–సంక్షేమం ప్రధాన అజెండా
ఈసారి బడ్జెట్ రూపకల్పనలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల అమలుకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపులు ఈ బడ్జెట్లో ప్రతిఫలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు హామీలలో నాలుగు అమలులో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. పెండింగ్‌లో ఉన్న కీలక హామీలలో ‘ఆడబిడ్డ నిధి’ పథకం ప్రధానంగా నిలుస్తోంది. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించే అంశంపై బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహిళా సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు పెరగనున్నాయని కూడా సంకేతాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఈసారి మరో ప్రత్యేకతగా నిలవనుంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమా, సాగునీటి ప్రాజెక్టులు, మార్కెటింగ్ సదుపాయాల విస్తరణ వంటి అంశాలకకు ప్రాధాన్యం ఇస్తారు. గణనీయ నిధులు కేటాయించే అవకాశముంది. అదనంగా, ఇరిగేషన్ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన కూడా ఉన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, కాలువల ఆధునీకరణ వంటి పనులకు భారీ నిధులు కేటాయించవచ్చని అంచనా.
కేంద్ర నిధుల లెక్కలపై తుది రూపు
ఇటీవల కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా, వివిధ పథకాల కింద లభించే నిధులపై స్పష్టత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లెక్కలను తుది దశకు తీసుకెళ్లింది. కేంద్ర సహాయంపై ఆధారపడి మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణ రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచే అవకాశముంది.
వ్యయ ప్రాధాన్యత రంగాలు
ఈ బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల సృష్టి వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విస్తరణకు ప్రోత్సాహక చర్యలు ప్రకటించే అవకాశముంది. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు కేటాయించవచ్చని సమాచారం.
రాజకీయ ప్రాధాన్యం
ఈ బడ్జెట్‌కు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉంది. ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమతుల్య బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమన్వయం పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మొత్తంగా రూ.3.50 లక్షల కోట్లకు చేరువలో ఉండే ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక దిశను నిర్దేశించే పత్రంగా నిలవనుంది. రేపటి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ వివరాలు వెల్లడైన తర్వాత కేటాయింపుల స్పష్టతపై పూర్తి చిత్రణ బయటపడనుంది. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగ వర్గాలు, రైతులు, మహిళలు, వ్యాపార వర్గాలు ఈ బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు నూ 1500 పథకం పైన బడ్జెట్ లో ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రాధాన్యత రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది.