AP Ration : ఏపీలో ఇకపై రేషన్‌ బియ్యం కట్

AP Ration : ఏపీలో ఇక రేషన్‌ బియ్యం కనిపించవు. బియ్యం బదులు డబ్బులు ఇస్తామంటోంది జగన్ ప్రభుత్వం.

Update: 2022-04-21 13:30 GMT

AP Ration : ఏపీలో ఇక రేషన్‌ బియ్యం కనిపించవు. బియ్యం బదులు డబ్బులు ఇస్తామంటోంది జగన్ ప్రభుత్వం. అది కూడా మార్కెట్లో దొరుకుతున్న బియ్యం రేటు కంటే చాలా చాలా తక్కువ రేటు కట్టి ఇస్తామంటోంది. నిజానికి డబ్బులు తీసుకోవడం ఆప్షన్ మాత్రమే. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్దిదారుల ఇష్టం. కాని, ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులు ఉన్న వాళ్లందరితోనూ డబ్బులే తీసుకునేలా బలవంతంగా ఒప్పించాలనుకుంటోంది. అందుకే, లబ్దిదారులకు ఆప్షన్ గీప్షన్ అనేదేం చెప్పకుండా.. ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకోవాల్సిందిగా ఒప్పించాలని, కావాలంటే మూడు నెలల తరువాత బియ్యం తీసుకోవచ్చని మేనేజ్‌ చేయండని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వీఆర్వోలకు డిప్యూటీ తాహశీల్దారు సంధ్య ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనం.

నరసాపురం పట్టణంలో కేవలం ఇద్దరు మాత్రమే నగదు బదిలీకి అంగీకరించారు. వేల మంది లబ్దిదారులు ఉంటే.. అందులో ఇద్దరే ఓకే అనడమేంటని ఉన్నతాధికారులు సమీక్ష పెట్టారు. ఈ సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌, ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారంటూ.. డిప్యూటీ తహశీల్దార్ సంధ్య వీఆర్వోలతో తన ఆవేదన పంచుకున్నారు. ఎలాగైనా సరే.. రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని బలవంతంగానైనా ఒప్పించాల్సిందేనంటూ వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ తహశీల్దార్‌ సంధ్య.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి నగదు ఇచ్చే కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుగుతోంది. విశాఖ, గోదావరి జిల్లాలు, అనంతపురం, కడప జిల్లాలో ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అభిప్రాయ సేకరణలో లబ్దిదారులు తమకు నగదు వద్దని, రేషన్ కావాలని తేల్చి చెప్పారు. మరోవైపు ఎంత నగదు బదిలీ చేస్తారు అనే అంశాన్ని లబ్దిదారులకు చెప్పలేదు ప్రభుత్వం. ఇక.. రేషన్‌కు నగదు బదిలీ అనేది ఆప్షన్‌ మాత్రమేనని, బలవంతం ఏమిలేదని నిన్న సివిల్ సప్లయ్స్ మంత్రి అన్నారు. ఈరోజు మాత్రం అధికారులు లబ్దిదారులను బలవంతంగా ఓప్పించమని ఆడియో సందేశాలు పంపారు. తాజాగా కిలోకి 16 రూపాయలు నగదు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేజీ బియ్యానికి ప్రభుత్వానికి 38 రూపాయల ఖర్చు వస్తుంది. అయితే 16 రూపాయలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం 22 రూపాయలను ఆదా చేసుకుంటుంది

రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వడం వెనక పెద్ద కుట్రే ఉందంటోంది టీడీపీ. మెల్లమెల్లగా రేషన్‌ కార్డులను ఎత్తేస్తారని, పేదలకు రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు వచ్చే అవకాశమే లేకుండా పోతుందని చెబుతున్నారు. రానురాను రేషన్ డీలర్ల వ్యవస్థనే ఎత్తేయొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేషన్ కార్డు ఆధారంగానే పేదోళ్లకు నిర్వచనం ఇస్తున్నాయి ప్రభుత్వాలు. రేప్పొద్దున రేషన్ కార్డ్ తీసేసి, అందరినీ ధనవంతుల కిందకే లెక్కించే ప్రమాదం లేకపోలేదని, తద్వారా ప్రభుత్వం పథకాల్లో కోత పెట్టే అవకాశం లేకపోలేదని టీడీపీ హెచ్చరిస్తోంది.

జగన్‌ సర్కారు రావడం రావడమే ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల నష్టమే తప్ప పైసా లాభం లేదని విపక్షాలు చెప్పినా వినలేదు. ఇంటింటికీ రేషన్ చేర్చడం కోసం ఆటోలు కొనుగోలు చేసింది జగన్ ప్రభుత్వం. డ్రైవర్‌కు, డ్రైవర్‌ అసిస్టెంట్‌కు కలిసి నెలకు 21వేల రూపాయలు ఇస్తోంది సర్కార్‌. ఇప్పుడు రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తే.. ఇక ఈ ఆటోలు ఎందుకు, ఆ డ్రైవర్లకు, అసిస్టెంట్లకు డబ్బులివ్వడం ఎందుకు అనే ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి ఆటో డ్రైవర్లు, అసిస్టెంట్లకు డబ్బులు ఇవ్వలేకనే.. ఇలా నగదు బదిలీ పథకం తీసుకొస్తున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.

కరోనా సమయంలో పేదల కడుపు నింపింది ఈ రేషన్ బియ్యమే. అలాంటి బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడమేంటని విమర్శిస్తున్నారు. పైగా కిలోకి 16 రూపాయలు మాత్రమే ఇస్తామంటోంది జగన్ ప్రభుత్వం. కాని, షాపులో దొడ్డు బియ్యం కొనాలన్నా కూడా కిలోకి 38 రూపాయలు ఉందని, అలాంటప్పుడు పేదలకు ఎలా న్యాయం చేసినట్టు అవుతుందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. ఏపీ పౌరసరఫరాల శాఖ.. 30 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందని, సప్లయ్ కార్పోరేషన్‌ను అత్యంత దయనీయంగా మార్చారని ఆరోపించారు.

ఒకప్పుడు రేషన్‌ కింద నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామంటూ పేదలకు హామీ ఇచ్చారు జగన్. ఆ తరువాత.. తన మాటను తప్పుగా అర్థం చేసుకున్నారని, కేవలం నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామన్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ బియ్యం పంపిణీనే నిలిపివేసే కుట్ర పన్నుతున్నారని జగన్ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని రీసైకిల్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నగదు బదిలీ చేయాలనుకుంటే మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తితో.. సన్న బియ్యం కేజీకి ఎంత అవుతోంది ఆ మొత్తం పేదలకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News