Andhra Pradesh : వర్షాలు తగ్గినా.. వరదలు ముంచెత్తుతున్నాయి..
Andhra Pradesh : వర్షాల్లేవ్ కానీ, ఏపీలో వరద ఉధృతి మాత్రం కొనసాగుతోంది..;
Andhra Pradesh : వర్షాల్లేవ్ కానీ, ఏపీలో వరద ఉధృతి మాత్రం కొనసాగుతోంది.. గోదావరికి వరద పోటెత్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. లంక గ్రామాలు నీట మునగడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.. దీంతో లంక గ్రామాల్లో దయనీయ దృశ్యాలు కనబడుతున్నాయి..
రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అటు తుంగభద్రకు వరద ఉధృతి పెరుగుతుండగా ఆ నీరంతా శ్రీశైలానికి పరుగులు తీస్తోంది.
ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు వణికిస్తుంటే.. ఇటు గోదావరికి వరద పోటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.. భద్రాచలం నుంచి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోలవరం ప్రాజెక్టు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తూ ధవళేశ్వరం వైపు పరుగులు తీస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం ఉంది.
గోదావరి ఉగ్రరూపంతో ఎగువన మన్యం, దిగువన కోనసీమ లంకలు విలవిల్లాడుతున్నాయి. దాదాపు 90 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. లంకలు నీట మునిగితే.. దేవీపట్నం చుట్టుపక్కల గిరిజన గూడేల్లోకి నీళ్లు చేరాయి. ఇప్పటికే 3 రోజులుగా జల దిగ్భందంతో అవస్థలు పడుతుంటే.. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందనే హెచ్చరికలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కూనాలంక, గురజాపు లంక, లంకాఫ్ ఠానేలంక, చింతపల్లి లంక, పొగాకు లంక గ్రామాల్లోని ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోడానికి లంక ప్రజలు నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపానికి కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోటిపల్లి, శేరిలంక గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి.. ఇక్కడి మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉండగా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వయంగా అక్కడకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.. పడవలో ప్రయాణిస్తూ వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బియ్యం మూటలు మోసుకుంటూ పడవపై వెళ్లి నీటమునిగిన మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు..
ఎగువ నుంచి గోదావరికి వరద పోటెత్తుండటంతో పోలవరం ముంపు మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆయా మండలాల్లో నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్లను వదిలివెళ్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులు.
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తహశీల్దార్ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. వరద బాధితుల కోసం తెచ్చిన నిత్యావసరాలు తమకు ఇవ్వకుండా ఆఫీసులో ఉంచుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద మొదలైంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతోపాటు.. తుంగభద్ర నుంచి వరద పోటెత్తుతోంది.. టీబీ డ్యామ్ 30 గేట్ల నుంచి లక్షా 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు..
సుంకేశుల డ్యామ్‌కు ఇన్‌ఫ్లో మరింత పెరుగుతోంది.. ఆరు గేట్ల ద్వారా వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.. (72425) తుంగభద్రతోపాటు, కృష్ణా నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యామ్‌లోకి ఇన్‌ఫ్లో మొదలైంది.