AP: మీ ఊరిలోనే సాఫ్ట్‌వేర్ ఆఫీస్

నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ ప్రకటించిన ఏపీ

Update: 2026-03-10 03:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న సంస్థలు, ఫ్రీలాన్సర్లు, ఐటీ అంకుర సంస్థలు సులభంగా తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు అవసరమైన కార్యాలయ వసతులు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ‘ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ (NWS) పాలసీ 2025–30’ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం ద్వారా స్థానిక స్థాయిలో వర్క్‌స్పేస్‌లు ఏర్పాటు చేసే సంస్థలకు పలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి కార్యాలయ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, డిజిటల్ కనెక్టివిటీ పెంపుతో గిగ్ ఎకానమీ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ పాలసీ ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. చిన్న, మధ్యతరహా సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన వర్క్‌స్పేస్ మరియు మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఫ్రీలాన్సర్లు, స్టార్టప్‌లు, ఐటీ రంగంలో పనిచేసే చిన్న సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఆఫీస్ ఏర్పాటుకు ఆర్థిక సాయం

స్థానికంగా వర్క్‌స్పేస్‌లు ఏర్పాటు చేసే డెవలపర్లకు ప్రభుత్వం పలు రకాల ఆర్థిక సాయాలను అందించనుంది. ఇంటీరియర్ డెవలప్‌మెంట్ కోసం గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. అదేవిధంగా ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేసే వర్క్‌స్పేస్‌లకు అద్దెపై 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీ ఏడాదికి గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు ఉంటుంది. ఐటీ హార్డ్‌వేర్ మరియు ఇతర సదుపాయాల ఏర్పాటుకు మూలధన వ్యయంలో 50 శాతం వరకు, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు సాయం అందించనున్నారు. అలాగే హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో కూడా ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. బ్రాడ్‌బ్యాండ్ ఖర్చులో 50 శాతం వరకు, ఏడాదికి గరిష్ఠంగా రూ.1 లక్ష చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించనుంది. అదనంగా బ్యాంకు రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు నెలకు రూ.10 వేల చొప్పున, ఎనిమిది శాతం వడ్డీ రాయితీని ఐదేళ్ల పాటు చెల్లించేలా చర్యలు తీసుకుంది.

ఈ పాలసీ కింద వర్క్‌స్పేస్‌లు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలకు కొన్ని కనీస ప్రమాణాలు కూడా నిర్దేశించారు. కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలంలో ఈ వర్క్‌స్పేస్ ఉండాలి. కనీసం పది వర్క్‌స్టేషన్‌ల సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేయాలి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం, ప్రింటింగ్ మరియు స్కానింగ్ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. సమావేశాలు నిర్వహించేందుకు కనీసం పది మందికి సరిపడే సమావేశ గది, మినీ ప్యాంట్రీ, మహిళల కోసం ప్రత్యేక విశ్రాంతి గది, సీసీటీవీ భద్రతా వ్యవస్థ వంటి సదుపాయాలు ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని సూచించింది. ప్రభుత్వ భవనాల్లో వర్క్‌స్పేస్‌లు ఏర్పాటు చేసే సంస్థలకు అద్దె మినహాయింపు ఇవ్వడం లేదా నామమాత్రపు అద్దెకు కేటాయించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక మండలంలో మొదటగా ఏర్పాటు చేసే వర్క్‌స్పేస్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ పాలసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అనుసంధానం పెరగడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, స్టార్టప్‌లు మరియు చిన్న సంస్థలు అభివృద్ధి చెందడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆసక్తి ఉన్న సంస్థలు ‘investandhra.ap.gov.in’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Tags:    

Similar News