YSRCP: తెలుగుదేశం, జనసేనపై సీఎం జగన్‌ విసుర్లు

కుటుంబాలను అడ్డంగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయన్న సీఎం జగన్

Update: 2024-01-04 02:45 GMT

 వైకాపాకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేసిన జగన్... రాబోయే రోజుల్లో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకినాడలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు. సీఎం పర్యటన కోసం పోలీసులు విధించిన ఆంక్షలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యారు. సామాజిక పింఛన్లను 3 వేలకు పెంచి... అభాగ్యులను ఆదుకుంటున్నామని... జగన్ అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా... అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేంద్రానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ లేఖ రాయడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని.... జగన్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని విమర్శలు ఎక్కుపెట్టారు.

జగన్ సభకు భారీగా జనాన్ని తరలించగా.... వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణానికి ఉదయం ఏడు గంటల నుంచే జనాన్ని తీసుకొచ్చారు. చిన్నారులతో వచ్చిన మహిళలు గంటలకొద్దీ వేచి ఉండలేక ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రసంగం ప్రారంభమవగానే... అధిక సంఖ్యలో జనాలు బయటకు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం మొదలయ్యే సరికి... ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. బయటికి వెళ్లే దారులను పోలీసులు మూసేసి నియంత్రించే ప్రయత్నం చేసినా... మహిళలు బారికేడ్లు తోసుకుంటూ బయటికెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా.. కరపకు చెందిన 65 ఏళ్ల రామారావు సొమ్మసిల్లి పడిపోయారు. కాకినాడలో భానుగుడి సెంటర్‌ నుంచి నాగమల్లితోట జంక్షన్, సభా వేదిక చుట్టుపక్కల మార్గాల్లో రాకపోకలపై పోలీస్ ఆంక్షలు విధించారు. సభ వద్దకు వచ్చేందుకు, సభ తర్వాత బస్సుల వద్దకు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు 

Tags:    

Similar News