AP: జవహర్‌రెడ్డికి మళ్లీ పోస్టింగ్‌

సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి... ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య;

Update: 2024-06-28 03:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్‌ రెడ్డి, మరో అధికారి పూనంమాలకొండయ్యకు రిటైర్‌మెంట్‌ ముందు రోజు చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల నాటికి ఆ ఆరోపణలు మరింత ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఆ టైంలో పింఛన్ల పంపిణీపై రేగిన దుమారానికి జవహర్ రెడ్డే ప్రధాన కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించాయి.

త్వరలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, నిరీక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్‌ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను ఏపీ కేడర్‌కు తీసుకొచ్చారు. ఆయనకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆయన్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు.

పింఛన్లు పంపిణీ విషయంలోనే కాదు కీలక నిర్ణయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించారనే అపప్రధను జవహర్‌రెడ్డి మూటకట్టుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్‌మెంట్‌ వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వేడుక చూశారని ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఆయన కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ఆయన తన హక్కులను సాధించుకున్నారని అంటారు. ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వానికి అంటకాగారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం రాక ముందే జవహర్‌రెడ్డిని పక్కన పెట్టింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఇంతలో నీరబ్‌ కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్ని రోజులు వెయిటింగ్‌లో ఉన్న జవహర్‌ రెడ్డికి గురువారం అర్థరాత్రి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

Tags:    

Similar News