REVANTH: ఏ జిల్లాను తొలగించం..కొత్త జిల్లాలు పరిశీలిస్తాం:సీఎం
తెలంగాణ సాధణలో విద్యార్థుల పాత్ర కీలకమన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జరిగిన ఉద్యమాల్లో విద్యార్థులు, కార్మికుల పాత్రను ఎవరూ విస్మరించలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనకు జరిగిన తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలక భూమిక పోషించారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో విద్యార్థులు చూపిన చైతన్యం, త్యాగాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులను దేశానికే ఆదర్శంగా సీఎం ప్రశంసించారు. భూమి లోతుల్లోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికి తీస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న సింగరేణి కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. వారి భద్రత, సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రను స్మరించుకున్న సీఎం, ఆ ప్రాంతం ఎన్నో ఉద్యమాలకు, రాజకీయ పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న భూపాలపల్లికి దిశానిర్దేశం చేసిన ఘనత దివంగత నేత ఎన్టీఆర్‌కు దక్కుతుందని గుర్తు చేశారు. ఆయన కాలంలో భూపాలపల్లిని మండల కేంద్రంగా ప్రకటించడంతో పాటు, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలి అడుగు పడిందన్నారు. ఆ నిర్ణయంతోనే భూపాలపల్లి అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యానించారు.
అప్పటి నుంచి భూపాలపల్లి ప్రాంతం వెనక్కి తిరిగి చూడలేదని, ప్రస్తుతం జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందని సీఎం వివరించారు. ఈ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాను రద్దు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే కొంతమంది ఇలాంటి విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్పష్టంగా చెబుతున్నానని, ఏ జిల్లాను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చిచెప్పారు. అదేవిధంగా, కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, అది ప్రజలకు బహిరంగంగా వెల్లడించి, శాసనసభలో సమగ్ర చర్చ జరిపిన తర్వాతే ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రతిపక్షాల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.