AP: కొత్త ఏడాది నుంచి అమల్లోకి మదనపల్లి జిల్లా
కొత్త జిల్లాలో పాలనకు ముహూర్తం ఫిక్స్... జనవరి 1 నుంచి అమల్లోకి మదనపల్లి జిల్లా... కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభానికి సన్నాహాలు
కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. శనివారం మదనపల్లె జిల్లా ఏర్పాటు సన్నాహాలకు సంబంధించి, ప్రభుత్వశాఖల భవనాల కోసం సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన పట్టణంలోని బీటీ కళాశాల, జీఆర్టీ హైస్కూల్, జీఎంఆర్ పాలిటెక్నిక్, రేస్ బీఈడీ కాలేజ్ భవనాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ కార్యాలయాలు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. భవనాల విస్తీర్ణం, అందుబాటులోని సౌకర్యాలు, చేయాల్సిన మరమ్మతులు, పార్కింగ్, ఇతర వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ...నవంబర్ 27న రాష్ట్రప్రభుత్వం మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తూ అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజుల గడువు ప్రకటించిందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నామన్నారు. ఈనెలాఖరులోపు కొత్త జిల్లా ఏర్పాటుపై పభుత్వం ప్రకటన చేయనుందన్నారు.తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం,బీటీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శైలజ పాల్గొన్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
అక్కడే జిల్లా కలెక్టరేట్..
కొత్త జిల్లాలో పారిపాలనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ఎంపిక చేయడంపై కలెక్టర్ నిషాంత్ కుమార్ దృష్టి సారించారు. ఇప్పటికే మదనపల్లెలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని.. నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన డీఎల్డీవో కార్యాలయంలో.. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇక ఇతర విభాగాల కార్యాలయాల కోసం కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మదనపల్లెలోని బీటీ కాలేజీలో కొన్ని విభాగాలను, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇవి సరిపోకపోతే.. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పరిపాలనకు సంబంధించి దాదాపు 60 విభాగాలుంటాయి. తాత్కాలిక కార్యాలయాలు అవసరం. అయితే అందులో 50 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. మిగతా కార్యాలయాలను.. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.