Loan Apps : మంత్రికీ తప్పని లోన్ యాప్ వేధింపులు..
Loan Apps : లోన్‌యాప్ వేధింపులు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి కూడా తప్పలేదు;
Loan Apps : లోన్‌యాప్ వేధింపులు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి కూడా తప్పలేదు. ఎవరో చేసిన అప్పుకు.. మంత్రితో పాతిక వేలు కట్టించుకున్నారు. అయినా సరే, ఫోన్ చేసి వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నైకి చెందిన నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరుకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి.. లోన్ యాప్‌లో 8 లక్షల 50 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అశోక్ ఫోన్ కాంటాక్ట్స్‌లో మంత్రి కాకాణి నెంబర్ ఉంది. దీంతో అశోక్ డబ్బులు కట్టకపోవడంతో డైరెక్టుగా మంత్రి కాకాణికి కాల్ చేశారు. అయితే, గడప గడప కార్యక్రమంలో మంత్రి బిజీగా ఉండడంతో.. పీఏ శంకరయ్య ఫోన్ లిఫ్ట్ చేశారు.ఒకట్రెండుసార్లు తమకు సంబంధం లేదని చెప్పినా.. మళ్లీమళ్లీ కాల్ చేశారు. ఫోన్ ఎత్తగానే దుర్భాషలాడారు. ఆ లోన్ తీసుకున్న అశోక్ అనే వ్యక్తి తమవాడే అయి ఉంటాడన్న ఉద్దేశంతో.. పాతిక వేలు కట్టారు.
అయినా సరే రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగలేదు. లోన్ కట్టకపోతే పిల్లల్ని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో మంత్రి కాకాణి పీఏ చెరుకూరి శంకరయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో.. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చెన్నైకి చెందిన కోల్ మెన్ రికవరీ ఏజంట్లను అరెస్ట్ చేశారు.