AP: ఏపీ ప్రజలను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
వరుస మరణాలతో అప్రమత్తమైన ఏపీ సర్కార్... చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో ‘స్క్రబ్ టైఫస్’ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 736 కేసులు నమోదయ్యాయి. కానీ అనధికారికంగా వీటి సంఖ్య వేలల్లో ఉండొచ్చని తెలుస్తోంది. బ్యాక్టీరియా సోకిన చిగ్గర్ మైట్ అనే నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ జ్వరాలకు ప్రధానకారణమవుతోంది. వర్షాలు కురిసే సమయంలో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో గత రెండు, మూడేళ్ల నుంచి ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నా తొలిసారిగా ఈ ఏడాది మూడు మరణాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వ్యాధి లక్షణాలతో మృతిచెందారు. కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ చెబుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 579 కేసులు నమోదు కాగా, 2024లో 803 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది నవంబరు 30 వరకూ 736 కేసులను ఆరోగ్యశాఖ గుర్తించింది.
విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి రాజేశ్వరి అనే మహిళ మృతిచెందంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్క్రబ్ టైఫస్ తీవ్రత పెరగకముందే.. ఈ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్తోకీటకాలు కుట్టడం వల్ల చనిపోయే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నల్ల మచ్చలతో గుర్తింపు
కీలకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటే జ్వరం, తలనొప్పితో పాటు కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫ్సగా అనుమానించాలి. ఈ పురుగు కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ఓరియాంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా మనిషి రక్తంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.