AP: మహిళలకు ఉచితబస్సు పై సర్వత్రా హర్షం
అందుబాటులోకి ఉచిత బస్సు ప్రయాణం.. లోకేశ్, పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రారంభించిన సీఎం ... స్త్రీశక్తితో మహిళల జీవితాల్లో పెనుమార్పులు: సీఎం;
‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘స్త్రీశక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, భాజపా ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్‌తో కలిసి సీఎం విజయవాడకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలతో సీఎం మాట్లాడారు. ఉండవల్లి గుహల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు.. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు వెల్లడించారు. స్త్రీశక్తి పథకం..పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయనుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీల భారం ఉండదన్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థినులు బస్ పాస్‌లు కొనాల్సిన అవసరం లేకుండానే బస్సుల్లో రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. మహిళా రైతులు, వ్యాపారులు, కూలీ చేసుకునేవారు.. తమ గ్రామాల నుంచి దగ్గరలోని పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా ఛార్జీల రూపంలో ఖర్చు మిగులుతుందన్నారు.
డ్రైవర్లుగా మహిళలు రావాలి..
ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది టీడీపీ ప్రభుత్వమే అన్న సీఎం చంద్రబాబు... మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలన్నారు. " ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం.. ఇలా ఏ పనిమీద అయినా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ‘‘ఈరోజు గర్వంగా చెబుతున్నా సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యింది. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. వైకాపా పాలనలో ప్రజలు ఐదేళ్ల పాటు నవ్వడమే మరిచిపోయారు.” అని చంద్రబాబు అన్నారు.
విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం.. ఇలా ఏ పనిమీద అయినా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకాతిరుమల, శ్రీకాళహస్తి. విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్నా బస్ఛార్జీల భారం కారణంగా వెళ్లలేనివారే అధికం. ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ఛార్జీల భారం లేకపోవడంతో.. తక్కువ ఖర్చుతో ఆలయాలకు వెళ్లివచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది. మొత్తంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.4 వేల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుందని అంచనా. ఐదు రకాల బస్సుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీచేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్లపై స్త్రీశక్తి పథకం అని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు.. ప్రయాణ ఛార్జీ ఎంతో ఉంటుంది. ఆ సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని.. ప్రయాణికురాలు చెల్లించాల్సింది సున్నా (0) అని ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.