AP: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి రిమాండ్
జైలుకు తరలించిన పోలీసులు... ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్;
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దొంగలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. వెంకటరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 2,566 కోట్లు నష్టం చేకూర్చారని ఆయనపై అభియోగం నమోదు అయింది. ఈ కేసులో అక్టోబర్ 10 వరకు వెంకటరెడ్డిని రిమాండ్‌కు పంపుతూ ధర్మాసనం ఆదేశించింది. ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక కాంట్రాక్టర్లకు సహకరించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా రూ.2,566 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. A1 నిందితుడిగా వెంకటరెడ్డిని చేర్చింది. కాగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డికి వీరవిధేయుడిగా వెంకటరెడ్డి పని చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇంటినుంచి ఆహారాన్ని అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వెంకటరెడ్డిని విచారణ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయాధికారి ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు వెంకటరెడ్డిని తరలించారు.
ఏమిటి ఆరోపణలు..?
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు వెంకటరెడ్డి ఇసుక, ఖనిజం, గనుల దోపిడీని యథేచ్ఛగా సాగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆయన నిర్వాకాలపై సమగ్ర విచారణ జరపాలని ఏసీబీని కోరుతూ గతనెల 31న ఆదేశాలు ఇచ్చింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రేవులు, గనుల తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. జగన్ జమానాలో 2,566కోట్ల సంపద దోపిడీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. వెంకటరెడ్డిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఆటను ఏసీబీ ఎట్టకేలకు కట్టించింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.... కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో అడుగుపెట్టి ఇసుక, గనులను జగన్ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.800కోట్లు ప్రత్యక్షంగా నష్టంచేకూర్చారు.
ప్రైవేట్ ఏజెన్సీలు దోచేస్తున్నా...
ప్రైవేటు ఏజెన్సీలు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోలేదు. జీసీకేసీ ప్రాజెక్ట్స్‌తో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కుమ్మక్కయ్యారు. మోసపూరితంగా జేపీవీఎల్‌కు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారు. తన పరిధిలో ఉన్న రూ. 120కోట్ల దారి మళ్లింపునకు పాల్పడ్డారు. లీజు సరిహద్దులు దాటి తవ్వకాలు, అనుమతించిన లోతు, పర్యావరణ అనుమతులు అన్నీ ఉల్లంఘించేందుకు సహకరించిన వెంకటరెడ్డి తవ్వకాలకు భారీయంత్రాలను ఉపయోగించిన ప్రైవేటు ఏజెన్సీలకు వత్తాసు పలికారు. వేలకోట్ల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డి పర్యావరణానికి నష్టం కలిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించినట్లు ఏసీబీ తెలిపింది.