KUMBHA MELA: కుంభమేళాకు ప్రత్యేక బస్సులు
విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు... అన్ని ఏర్పాట్లు చేశామన్న అధికారులు;
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. సుమారు 13 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. కుంభమేళా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 13.21 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కుంభమేళా సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది.
విజయవాడ నుంచి..
ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. 2న సాయంత్రం ప్రయాగరాజ్ చేరుకుంటాయి. 3న ప్రయాగ్ రాజ్‌లో బస ఉంటుంది. 4న రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరుతాయి. 5న ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడి దర్శనాంతరం రాత్రికి వారణాసికి పయనమవుతాయి. 6న వారణాసి చేరుకొని అక్కడే రాత్రికి బస ఉంటుంది. 7వ తేదీ ఉదయం వారణాసి నుంచి విజయవాడకు బయలుదేరి 8న చేరుకుంటాయి. ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుంది. అది కూడా కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమేనని, భోజనం, వసతి ఖర్చులు వారే పెట్టుకోవాలి. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు 29 నుంచి 35 మంది సమూహంగా వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్‌లైన్, సమీప బస్ స్టేషన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు పొందవచ్చు. మరిన్ని వివరాలకు 80742 98487, 0866 2523926, 0866 2523928 నంబర్లలో సంప్రదించాలి.