ASSEMBLY: కోర్టుకు వెళ్లినా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం
స్పష్టం చేసిన స్పీకర్ అయన్నపాత్రుడు... ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టీకరణ... కోర్టుకు వెళ్లినా ప్రతిపక్ష ఇవ్వలేమన్న స్పీకర్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న ‘రప్పా రప్పా’ డైలాగులపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని.. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని స్పీకర్ అన్నారు. వైసీపీ సభ్యులు సభకు రాకుండానే ప్రశ్నలు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గౌతు లచ్చన్న పార్టీ తరఫున 64 మంది ఎన్నికైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారని.. అయితే సభ్యులు కొందరు పార్టీ మారిన నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష హోదాను స్వయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. జగన్ మాత్రం సంఖ్యాబలం లేకున్నా ప్రతిపక్ష హోదా అడగటమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. జగన్ కోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. దేవుడే వరం ఇవ్వనప్పుడు, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లినా సరే జగన్‌కు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని కుండబద్ధలు కొట్టి చెప్పేశారు.
నేను పూజారిని మాత్రమే..
దేవాలయంలో తాను ఒక పూజారిని మాత్రమేనని.. దేవుడే వైఎస్ జగన్‌కు వరం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అప్పుడు పూజారిని అయిన తాను మాత్రం ఏం చేయగలనని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌గా తాను చట్ట ప్రకారమే నడుచుకుంటానని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు సూచించారు. సభకు రాకుండా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చినట్టు సంతకాలు పెట్టి వెళ్తున్నారని వారి సంగతి చూడాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. దీనిపై విచారణ సాగుతున్న వేళ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదాపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు జగన్ వెళ్లడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు. అలాంటి ప్రజలే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ఈ పరిస్థితుల్లో తాను ఏం చేయలేనని చెప్పుకొచ్చారు. రూల్స్‌ను గత సంప్రదాయాలను అనుసరించే తాను ఏదైనా నిర్ణయం తీసుకోగలనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.