MUNCIPLPOLL: తెలంగాణ పుర పోరులో కాంగ్రెస్‌దే పై "చేయి"
డోర్నకల్, అశ్వారావుపేటలో కాంగ్రెస్ జైత్రయాత్ర!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాజకీయ సమీకరణాలను స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూ ముందంజలో నిలిచింది. కూటమి, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ, మెజార్టీ మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ పైచేయి సాధించినట్లు తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 11 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. బీఆర్‌ఎస్ మూడు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. నందికొండ, అశ్వారావుపేట, హాలియా, నేరేడుచర్ల, డోర్నకల్, సుల్తానాబాద్, మరిపెడ, మంథని, ధర్మపురి, భీంగల్, హుజూర్‌నగర్ వంటి మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మరోవైపు గడ్డపోతారం, అయిజ, తొర్రూరు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. పట్టణ ఓటర్ల తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందనే సంకేతాలు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నాయి.
అయితే కొన్ని మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 5 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో చోట విజయం సాధించారు. దీంతో అక్కడ అధికారం కోసం చర్చలు, మద్దతుల సమీకరణ కీలకంగా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 4 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ మరియు ఇతర అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్నది మద్దతులపై ఆధారపడి ఉండనుంది.
ఖమ్మం జిల్లా మధిరలో 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఆమె విజయం సాధించి స్థానికంగా చర్చకు దారితీశారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఒక చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం స్థానిక రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. క సంగారెడ్డి జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 24, 26 వార్డుల నుంచి పోటీ చేసిన భార్యాభర్తలైన కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ గెలుపొందడం మరో విశేషం. కుటుంబ సభ్యులు ఒకేసారి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
డోర్నకల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. డోర్నకల్‌లో 15 వార్డుల్లో 10 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది అశ్వారావుపేటలో 22 వార్డుల్లో 17 స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతును సూచిస్తున్నాయి.ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం వార్డు ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ 451 స్థానాలు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 231, బీజేపీ 61, ఇతరులు 71 స్థానాలను దక్కించుకున్నారు. ఈ గణాంకాలు పట్టణ ఓటర్ల అభిరుచిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో మున్సిపల్ ఫలితాలు కీలకంగా మారాయి.
మొత్తంగా చూస్తే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానం కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే హంగ్ మున్సిపాలిటీల్లో మద్దతుల సమీకరణ ఎలా జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి ఫలితాలు వెలువడే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగనుంది.