BILL GATES: చంద్రబాబు విజన్‌కు జై కొట్టిన బిల్‌గేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అద్భుతం: బిల్‌గేట్స్.. పాలనలో సాంకేతికంగా అత్యున్నతమని వ్యాఖ్య.. చంద్రబాబు పాలన గ్రేట్.. జై కొట్టిన బిల్‌గేట్స్... అమరావతి గురించి వివరించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ ఆధారిత పాలన అమలు తీరు ఆకట్టుకునేలా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన ఆయన, అక్కడ అమలు చేస్తున్న డిజిటల్ విధానాలను సమగ్రంగా పరిశీలించారు. డిస్ప్లే వాల్స్‌పై ప్రదర్శించిన ప్రజెంటేషన్లను ఆసక్తిగా వీక్షిస్తూ, పాలనలో సాంకేతికత వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ‘డేటా లేక్’ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానించామని సీఎం వివరించారు. దీని ద్వారా విభాగాల మధ్య సమాచారం వేగంగా మార్పిడి కావడంతో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగిందన్నారు. ముఖ్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న విధానాన్ని గేట్స్‌కు వివరించారు. అవేర్ 2.0 ప్లాట్‌ఫామ్ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించి, ప్రజలకు 42 రకాల కీలక సమాచారాన్ని అందిస్తున్నామని చెప్పారు. రైతులకు వాతావరణ సూచనలు, పంటల పరిస్థితులు, మార్కెట్ ధరలు వంటి అంశాల్లో సమయానుకూల సమాచారం అందించడం వల్ల ప్రభుత్వ స్పందన మెరుగుపడిందని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంశం కూడా గేట్స్ దృష్టిని ఆకర్షించింది. ప్రజల చేతుల్లోనే 921 పౌరసేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం వివరించారు. ఫిర్యాదుల నమోదు, సర్టిఫికేట్ల జారీ, వివిధ సేవల దరఖాస్తులు వంటి ప్రక్రియలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సులభతరం చేశామని తెలిపారు.
పాలన అద్భుతమన్న గేట్స్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు. రాష్ట్రంలో జీఎస్డీపీ పెరుగుదలను కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఏపీలోని ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని గేట్స్ అడిగారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు. భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏపీ ఏఐ సెర్చ్ బార్ ను అందుబాటులోకి తెచ్చామని అధికారులు గేట్స్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిని పరిశీలించిన బిల్ గేట్స్ పన్నుల వసూళ్ల ప్రక్రియ అద్భుతమని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పన్నుల వసూళ్ల ప్రక్రియ బాగా సులభతరమైందని, వసూళ్లు కూడా పెరిగాయని ముఖ్యమంత్రి వివరించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరునూ పరిశీలించారు.