నేడు జనసేన, బీజేపీ చలో రామతీర్థం

Update: 2021-01-05 02:59 GMT

బీజేపీ, జనసేన చలోరామతీర్థానికి పిలుపునివ్వడంతో ఏపీలో మరోసారి టెన్షన్ నెలకొంది. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించాలని బీజేపీ-జనసేన నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి సెక్షన్ 30 ప్రకారం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన జిల్లా పోలీసులు పలువురిని హౌస్‌ అరెస్టులు చేయడంపై నేతలు మండిపడుతున్నారు. అటు ఇప్పటికే జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

గుంటూరులో మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. రాత్రి భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇచ్చారు. రామతీర్థం వెళ్లకుండా ఆంక్షలు విధించారు..అటు తనను హౌస్‌అరెస్టు చేయడంపై కన్నా మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలు, ఆస్తులు, దేవుళ్ళు విగ్రహాలను నాశనం చేసే ఘటనలు పెరిగిపోయాయని అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

శాంతిభద్రతలు, కోవిడ్- 19 వ్యాప్తి దృష్ట్యా రామతీర్థంలోని కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సెక్షన్- 30, పోలీసు చట్టం 1861 మరియు కోవిడ్ డిజాస్టర్ మేనేజ్ మెంటు చట్టం అమల్లో ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని సూచించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణలో పాల్గొనవద్దన్నారు. ప్రజలు గుంపులుగా చేరడం వలన కోవిడ్ వ్యాధి వేగంగా ప్రబలే అవకాశం ఉందని.. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రామతీర్థం, రాజమహేంద్రవరం విఘ్నేశ్వరాలయం ఘటనలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇది సున్నితమైన ఘటన అని.. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు దొరికాయని రెండు మూడు రోజుల్లో వారిని పట్టుకుంటామని చెప్పారు. బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు చేపట్టిన చలో రామతీర్థంను విరమించుకోవాలని మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News