Jagan UK Trip: విదేశీ పర్యటనకు అనుమతించొద్దన్న సీబీఐ

27కు విచారణ వాయిదా;

Update: 2024-08-21 08:00 GMT

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. లండన్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ విదేశి పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇరువురి పిటిషన్‌లపై వాదనలు ముగియగా ఈనెల 27కు నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే జగన్‌పై ఉన్న కేసుల విచారణ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది.

పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పైనే ఉన్నారంటూ సీబీఐ అభ్యంతరం తెలిపింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సర్వోన్న న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో జగన్‌‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ అభ్యంతరాలను జగన్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. గతంలో కూడా పలుమార్లు కోర్టు విదేశీ పర్యటనలకు అనుమతించి ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను జగన్ ఎప్పుడు ఉల్లంఘించలేదని గుర్తు చేశారు.

వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీనివ ఏర్పాటు చేసుకున్న సమయంలో జగన్‌పై క్విడ్‌ ప్రో కో కేసులు నమోదు అయ్యాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 11 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ దాదాపు పదిహేనేళ్లుగా సాగుతోంది. 2011 తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జగన్ 16నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

ఆస్తుల కేసుల్లో జగన్‌పై ఉన్న కేసులపై విచారణ సాగదీయడంపై మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సీబీఐ ఒత్తిడి చేస్తోంది. మరోవైపు లండన్‌లో ఉంటున్న కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు జగన్ మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News