CBN: క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు
నంధ్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజులో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. రైతుల భూములను ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో పెట్టి వేధించారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములపై పెత్తనం చలాయించాలని చూశారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి, భూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. గత పాలకులు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించుకుని ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్లు వృథా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన 19.93 లక్షల తప్పుడు పుస్తకాలను పక్కనబెట్టి, ఇప్పుడు పక్కాగా క్యూఆర్ కోడ్ , బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు.
వైకాపా హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కొత్తబురుజు గ్రామసభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు.
హంద్రీనీవా నుంచి తాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా కొత్తబురుజు సభలో చంద్రబాబు ప్రసంగించారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి సైతం నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పమని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఇచ్చిన రిపోర్టుపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారికి అపచారం చేయాలని చూశారని, కానీ తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మత విద్వేషాలనూ రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు. ఇందులో భాగంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. . సీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వాటిని పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు నీటిని అందించామని, భగీరథుని స్పూర్తితో ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే తన సంకల్పమని పేర్కొన్నారు. మామిడి రైతులకు కేజీకి రూ.4 సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.