CBN: రాష్ట్రపతికి అవమానంపై చంద్రబాబు ఆవేదన
దేశానికే అగౌరవమన్న చంద్రబాబు... వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పశ్చిమ బెంగాల్ పర్యటన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రోటోకాల్ ఉల్లంఘనల పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల అగౌరవం దేశానికే అవమానం అసహనం వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్లో "ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవులు రాజకీయాలకు అతీతమని, రాష్ట్రపతి పదవి మన గణతంత్ర వ్యవస్థ యొక్క గౌరవానికి చిహ్నమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రపతి పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాద, గౌరవంలో లోపాలు జరగడం కేవలం ఆ పదవికే కాకుండా, దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థల పవిత్రతను కాపాడటం మన బాధ్యతన్నారు.
బెంగాల్ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహg వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో తన పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక ఎంపిక అంశానికి సంబంధించి ఏర్పాట్లను సరిగా చేయకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన ముర్ము.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు. కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం బాధించింది. ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్నగర్లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రొటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ లేఖ రాశారు. అందులో కేంద్రం కొన్ని అంశాలను ప్రస్తావించింది.
* రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎందుకు హాజరు కాలేదు?
* రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్‌లో నీళ్లు లేవు.
* రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది.
* డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగుడి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయండి.
దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చింది. అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్ వెళ్లారు.