CBN: కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం

ఏపీ ప్రాజెక్టులపై చర్చించనున్న చంద్రబాబు

Update: 2026-02-10 04:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సీఎం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకొని, ఉదయం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే పార్టీ ఎంపీలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ, పార్లమెంటరీ పరిస్థితులపై చర్చించారు. నేడు ఉదయం 10 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. అనంతరం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం జరగనుంది. ఒంటి గంటకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సీఎం భేటీ కానున్నారు.

ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అంశంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. అలాగే తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం, పూర్వోదయ పథకం అమలు పరిస్థితి, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారం వంటి అంశాలను కూడా సీఎం కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేసేందుకు కేంద్రం నుంచి అవసరమైన సాయం, ప్రత్యేక సహకారం అందించాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఈ వరుస సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా మారనున్న నేపథ్యంలో, ఢిల్లీలో జరుగుతున్న ఈ చర్చలకు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.

Tags:    

Similar News