cbn: రంగరాయ కళాశాల ఘటనపై సీఎం ఆగ్రహం
జీఎస్టీ వసూళ్లలో ఆదర్శంగా ఉండాలి: సీఎం;
కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రంగరాయ వైద్యకళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్‌తో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలపై ఇలాంటి చర్యలకు దిగుతున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు.
జీఎస్టీ వసూళ్లలో ఆదర్శంగా ఉండాలి: సీఎం
జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆంధ్రప్రదేశ్ రోల్‌మోడల్‌గా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్ర-రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్‌లాంటి సాంకేతికతను వినియోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. సమర్థమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని.. దాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలన్నారు. జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర-రాష్ట్ర అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు.