CBN: దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్
మేం నిమిత్తమాత్రులం.. దేవుడే శిక్షిస్తాడన్న చంద్రబాబు... ఎవర్నీ వదిలేది లేదు-చూస్తూ ఊరుకునేది లేదన్న సీఎం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘తప్పుచేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. బూతులు తిట్టినా మేం భరించాలా? దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తాం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ మాకు ఓ నివేదిక పంపింది. ఏక సభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తాం. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని అసెంబ్లీలో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాం. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే ఎదురుదాడికి దిగారు. లడ్డూ కల్తీ ప్రజల మనోభావాలకు ముడిపడిన అంశమని ఆయన చెప్పారు. శ్రీవారి తమ ఇంటి కులదైవమని, 2003లో తన హత్యాయత్నం జరిగితే ఆయనే బతికించారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి తమల్ని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు. తమను బూతులు తిట్టి సెలైంట్‌గా ఉండమంటున్నారని మండిపడ్డారు. నెయ్యి కల్తీపై వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు.
గత ఐదేళ్ల కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించి అనేక అపచారాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని పలుమార్లు హెచ్చరించినా, అప్పటి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. వారి ప్రవర్తన పరాకాష్టకు చేరిందని వ్యాఖ్యానించారు. రాముడి విగ్రహానికి సంబంధించిన ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్లిన తనపై కేసులు పెట్టారని, అంతర్వేదిలో రథం దగ్ధమైతే కందిరీగలు కారణమని చెప్పడం ఎంత అవమానకరమో ప్రజలే ఆలోచించాలని అన్నారు. ఆంజనేయుడి విగ్రహానికి జరిగిన నష్టం విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అది కేవలం బొమ్మే కదా, ఇంకొకటి పెట్టుకోవచ్చని మాట్లాడటం దేవుడిపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. బ్రిటిష్ పాలకులు కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్లలేదని గుర్తు చేస్తూ, అలాంటి పవిత్ర స్థలంపై అపచారాలు జరగడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అది మహాపాపమని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో సీబీఐ ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పలేదని, అయినా కొందరు అసత్యాన్ని ప్రజల్లో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.