AP: అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం
పలు కీలక ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపిన కేంద్రం... మళ్లీ అభివృద్ధి బాటలో అమరావతి;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సహా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు సహా కీలక ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించేసింది. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కేంద్రం ముందుంచి.. ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపిన అన్ని ప్రాజెక్టులు గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే కావడం విశేషం. ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అమరావతితో పాటు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. అమరావతిపై కక్షతో ఓఆర్‌ఆర్‌నీ అటకెక్కించారు. అమరావతికి ఓఆర్‌ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తొలి ఢిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్‌ఆర్‌పై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం.
ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లుగా ఉంది. 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు రూ.17,761.49 కోట్లు, అసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లుగా ఉంది. ఆరున్నరేళ్ల క్రితానికీ ఇప్పటికీ... ద్రవ్యోల్బణం పెరిగినందున ఓఆర్‌ఆర్ నిర్మాణ వ్యయం కూడా రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. భూసేకరణకయ్యే ఖర్చు కూడా కలిపితే అది రూ.25 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు.