Chandrababu : చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలే రక్షణ..

Update: 2025-10-29 08:45 GMT

ఏపీని మొంథా తుఫాన్ ముంచేస్తోంది. ప్రకృతి బీభత్సానికి తీర ప్రాంతమంతా కల్లోలం అయిపోయింది. విపత్తులను ఎవరూ ఆపలేరు. కానీ వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. ఎంతటి ముందు జాగ్రత్తలతో ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగం అన్నదే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతటి సమర్థవంతంగా ఈ ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కొన్నారో కనిపిస్తోంది. విపత్తులను ఎదుర్కోవడంలో చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉంది. తెలుగువారు ఎక్కడ ప్రమాదంలో ఉన్నా సరే.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అలర్ట్ అయిపోతుంటారు. అదే చంద్రబాబు నాయుడు చతురత. అంతా అయిపోయాక నష్టపరిహారం ప్రకటించడం చంద్రబాబు నాయుడు ఉద్దేశం కాదు.. అసలు నష్టమే జరగకుండా కాపాడాలన్నది ఆయన ఆరాటం. చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడే ఏపీ నుంచి ఆయనకు సమాచారం వెళ్ళింది. అల్పపీడనం బలపడి తుఫాన్ గా మారుతుంది అనే సంకేతాలు తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు అలెర్ట్ అయ్యారు.

దుబాయ్ లో అంతటి బిజీ షెడ్యూల్ నడుమ కూడా.. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ వస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ ఏ జిల్లాలకు ఎంతటి ఎఫెక్ట్ ఉంటుంది.. ముందస్తు జాగ్రత్తలు, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, రెస్క్యూ టీమ్స్ ను ఏపీకి రప్పించడం, పునరావాస కేంద్రాలను రెడీ చేయించడం, అత్యవసర ఏర్పాట్లను రెడీ చేయడం, బాధితులకు ఆహారం, ప్రత్యేక నిధులు, కొత్త కరెంటు స్తంభాలను రెడీ చేయించడం, విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయించడం, విపత్తు సమయంలో కావాల్సిన అన్ని రకాల సామాగ్రిని ముందే తీసుకువచ్చేలా ఆదేశించారు. దుబాయ్ నుంచే ఇన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అధికారులు కూడా ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. మొంథా తుఫాన్ తీరం దాటకముందే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గర్భిణీలను ప్రత్యేక వసతుల మధ్య డాక్టర్ల సమక్షంలో ఉంచారు. ఆ వెంటనే దుబాయ్ నుంచి వచ్చేసి.. అధికారులతో, మంత్రులతో వరుసగా మీటింగులు పెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి 17 మంది ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వారికి కీలక బాధ్యతలను అప్పగించారు.

రోడ్లు తెగిపోతే, రైల్వే పట్టాలు కొట్టుకుపోతే, కరెంటు స్తంభాలు కూలిపోతే, చెట్లు విరిగిపోతే వెంట వెంటనే రిపేర్ చేయాలని.. ఎక్కడా కరెంటు సమస్యలు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గజ ఈత గాళ్లను రంగంలోకి దించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా అత్యంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కరిని కూడా రోడ్డు ఎక్కనివ్వకుండా ఎక్కడి వాళ్ళను అక్కడే ఆపేశారు. ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం సృష్టించి అందరినీ ప్రాణాలతో కాపాడగలుగుతున్నారు. కొంత ఆస్తి నష్టం కలగొచ్చుగాక.. ఎందుకంటే ఇలాంటి ప్రకృతి విపత్తులను ఆపలేం కదా.. కానీ ఆ ఆస్తి నష్టాన్ని అత్యంత త్వరగా పూడ్చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 19 కోట్లు ప్రత్యేకంగా ఈ విపత్తు కోసమే కేటాయించారు చంద్రబాబు నాయుడు. అందుకే విరిగిన స్తంభాలను వేగంగా తీసేసి కొత్తవి పెడుతున్నారు. అర్ధరాత్రి చెట్లు రోడ్డుమీద విరిగిపోయినా సరే.. వెంట వెంటనే క్లియర్ చేస్తున్నారు. చెరువులు, కుంటలు తెగిపోకుండా ముందే బస్తాలతో పటిష్టంగా ఉంచారు. తాగునీరు సమస్య లేకుండా చూస్తున్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యవసర సరుకులను ప్రభుత్వమే ఇంటింటికి వెళ్లి అందిస్తోంది. మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు చెత్త పేరుకుపోకుండా క్లియర్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని.. ఒక్క ప్రాణం పోకుండా చంద్రబాబు నాయుడు రక్షణ కవచంలా నిలబడ్డారు.


Full View

Similar News